కాబూల్: తాలిబన్లు విధించిన ఆంక్షలు మరింత కఠినం కావడంతో అఫ్గానిస్థాన్ మహిళల్లో సగం మంది ఇప్పుడు నెలలో ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే ఇళ్ల బయటకు వెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ బుధవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.
అఫ్గాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లతోంది. ప్రపంచంలోని బాలికలకు మాధ్యమిక విద్యను నిషేధించిన, మహిళలు విశ్వవిద్యాలయాల్లో చదవడాన్ని అడ్డుకున్న ఏకైక దేశంగా అఫ్గానిస్థాన్ కొనసాగుతోందని లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ తెలిపింది.
“2021 ఆగస్టులో తాలిబన్ అధికారం చేపట్టిన తర్వాత గడిచిన అర్ధ దశాబ్దంలో, అఫ్గానిస్థాన్ తన జనాభాలో సగం మంది హక్కులను వ్యవస్థీకృతంగా తొలగించింది. ఆధునిక ప్రపంచంలో దీనికి సమానమైన ఉదాహరణ లేదు. దీంతో అది ప్రపంచంలో ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది” అని ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ ప్రకటనలో పేర్కొంది.
మహిళలపై ప్రభుత్వ నిబంధనల్లో చాలా వాటిని అమలు చేసే తాలిబన్ ఆధ్వర్యంలోని సద్గుణాల ప్రచారం, దుర్గుణాల నిరోధక మంత్రిత్వ శాఖ స్పందన కోరినా వెంటనే స్పందించలేదు. ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కూడా స్పందించలేదు. 2021లో అఫ్గానిస్థాన్‌లో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత తాలిబన్ సుమారు 2.4 మిలియన్ల అఫ్గాన్ బాలికలను మాధ్యమిక విద్యకు దూరం చేసిందని ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ మంగళవారం తెలిపింది.
తాలిబన్ అధికారం చేపట్టిన తర్వాత మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని 100కు పైగా ఆదేశాలు జారీ చేశారని, వాటి వల్ల వివక్షకు సంస్థాగత రూపం వచ్చిందని, ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మహిళా హక్కుల సంక్షోభం మరింత లోతుగా మారిందని ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ తెలిపింది.
తాలిబన్ మాత్రం తమ ఇస్లామిక్ చట్టాల వ్యాఖ్యానం, అఫ్గాన్ సంస్కృతికి అనుగుణంగా మహిళల హక్కులను గౌరవిస్తున్నామని చెబుతోంది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో సగానికి పైగా మంది నెలలో రెండుసార్లు లేదా అంతకంటే తక్కువసార్లు మాత్రమే ఇళ్ల బయటకు వెళ్తున్నట్లు తెలిపారు. దాదాపు మూడు వంతుల మంది పురుష సంరక్షకుడు అయిన మహ్రం లేకుండా బయటకు వెళ్లడం సురక్షితం కాదని చెప్పారు.
ఈ ఆంక్షల వల్ల మానసిక ఆరోగ్య సంక్షోభం కూడా మరింత తీవ్రమైందని ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ తెలిపింది. 10 మందిలో ఏడుగుడు మహిళలు తమ మానసిక ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. ఒంటరితనం, అవకాశాల కోల్పోవడం, సహాయక వ్యవస్థలకు పరిమిత ప్రాప్యత కారణాలుగా పేర్కొన్నారు.
ఇటీవల జారీ చేసిన ఆదేశాలు మహిళలకు ఉన్న చట్టపరమైన రక్షణను మరింత బలహీనపరిచాయని సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన చర్యల వల్ల చట్టం ముందు పురుషులు, మహిళలకు సమాన హోదా రద్దయిందని, వివాహ జీవితంలో పురుషుల అధికారాన్ని పెంచిందని, మహిళలు విడాకులు కోరడం మరింత కష్టతరం చేసిందని తెలిపింది.
మహిళలు ఇంకా ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా దూరంగానే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ నివేదిక ప్రకారం మహిళల్లో కేవలం 7% మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. పురుషుల్లో ఈ సంఖ్య 84%గా ఉంది. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య 2,190 మందిని ప్రత్యక్షంగా కలసి నిర్వహించిన సర్వే, 2026 ఏప్రిల్ నుంచి మే మధ్య 2,811 మందితో నిర్వహించిన టెలిఫోన్ సర్వేల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.


