ట్రంప్‌కే షాక్‌ ఇచ్చిందా? ఐయామ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ.. | Who is Jayme Leagh Franklin? Woman Standing Next to Trump Clears Air on Viral 'Zapper' Video | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కే షాక్‌ ఇచ్చిందా? ఐయామ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ..

Aug 12 2026 1:45 PM | Updated on Aug 12 2026 1:48 PM

Woman Standing Next to Trump Goes Viral Clears the Air

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చుట్టూ మరోసారి సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈసారి కారణం ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం కాదు.. ఆయన పక్కన నిల్చున్న ఓ మహిళ. ట్రంప్‌ కీలక ఆదేశంపై సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన కనిపించిన మహిళపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్‌ అయ్యాయి. చివరకు ఆ మహిళే స్పందించి అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో వ్యాక్సినేషన్‌ విధానానికి సంబంధించి కీలక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ ఆయన పక్కన నిల్చున్నారు. వీడియోలో ఆమె పదేపదే తల ఊపుతూ, ఒక చేయిని తన పొట్టపై ఉంచుకున్నట్లు కనిపించింది. ఆ వెంటనే మత్తులోకి జారుకున్నట్లు కనిపించిన ట్రంప్‌.. హఠాత్తుగా అప్రమత్తం అయ్యారు. దీంతో కొందరు సోషల్‌ మీడియా యూజర్లు విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు.

ట్రంప్‌కు షాక్‌ ఇచ్చిందా?..
కొందరు నెటిజన్లు ఆమె చేతిలో ఏదో పరికరం ఉందని, ట్రంప్‌ను అప్రమత్తం చేసేందుకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చిందంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పేరు జేమీ లీగ్‌ ఫ్రాంక్లిన్‌ (Jayme Leagh Franklin). ఆమె అమెరికాలోని కన్జర్వేటివ్‌ మీడియా, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ది కన్జర్వేటర్‌ (The Conservateur) వ్యవస్థాపకురాలు, సీఈవో.

నెట్టింట వస్తున్న వింత ఆరోపణలపై స్పందించిన ఫ్రాంక్లిన్‌.. తాను గర్భవతినని వెల్లడించారు. తన పొట్టపై చేయి పెట్టుకోవడానికి కారణం అదే అని స్పష్టం చేశారు. “నేను కేవలం గర్భవతిని మాత్రమే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ట్రంప్‌కు తాను షాకిచ్చి అప్రమత్తం చేశానంటూ తనపై వస్తున్న ఊహాగానాలను చూసి ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు.

ఆ కార్యక్రమంలో ఎందుకు ఉన్నారు?
వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్‌ ఎఫ్‌. కెన్నెడీ జూనియర్‌ల మధ్య ఫ్రాంక్లిన్‌ నిల్చున్నారు. బాలల వ్యాక్సినేషన్‌ సిఫార్సుల్లో మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్‌ అయింది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ట్రంప్‌తో కలిసి ఓవల్‌ ఆఫీస్‌లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎవరు జేమీ లీగ్‌ ఫ్రాంక్లిన్‌?
జేమీ లీగ్‌ ఫ్రాంక్లిన్‌ గతంలో ట్రంప్‌ పాలనలో పనిచేశారు. నార్త్‌ కరోలినాకు చెందిన ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్‌లీ నుంచి 2020లో పట్టా పొందారు. 2019లో అమెరికా సెనేట్‌లో లెజిస్లేటివ్‌ ఇంటర్న్‌గా పనిచేసిన ఆమె.. 2020 ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో కోయలిషన్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అనంతరం ట్రంప్‌ తొలి వైట్‌హౌస్‌ పాలనలో కరస్పాండెన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె నడుపుతున్న ది కన్జర్వేటర్‌.. రాజకీయాలు, సంస్కృతి, విశ్వాసం, ఫ్యాషన్‌, బ్యూటీ అంశాలపై కంటెంట్‌ అందించే కన్జర్వేటివ్‌ మీడియా సంస్థగా కొనసాగుతోంది. అదీ అసలు ముచ్చట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement