సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్‌కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని.. కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా, రీల్స్ యుగంగా మారిందని ప్రధాని అన్నారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సరైన మార్గం కాదని చెప్పారు.
“ఇది రీల్స్ కాలం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. కానీ ఈ షార్ట్‌కట్ యుగంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. రైల్వే స్టేషన్లలో రాసి ఉంటుంది.. ‘షార్ట్‌కట్స్ విల్ కట్ యూ షార్ట్’” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవాలని సూచించారు. వారి ప్రయాణం, కష్టాలు, విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు.
ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది తెలిసిందే. జంతర్ మంతర్ నీట్ నిరసనల తర్వాత.. తొలిసారి సెల్ఫీ వీడియో సందేశం ఇచ్చారు ఆయన. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశాలపై వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతను ఆకట్టుకోవాలని మంత్రులకు, ఎంపీలకు సైతం ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జెన్‌జీపైనా వివిధ కార్యక్రమాల్లో వరుసగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
కోవింద్ జీవితం యువతకు స్ఫూర్తి
ఇవాళ్టి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల కథ కాదని.. అది భారత ప్రజాస్వామ్యం, సమాజం అందించిన అవకాశాలకు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారని గుర్తు చేశారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
పదవి నుంచి దిగినా దేశ సేవ కొనసాగింపు
రాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’(వన్‌నేషన్.. వన్ ఎలక్షన్) అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మోదీ అన్నారు.
కోవింద్ వినయం.. భారత విలువలకు ప్రతీక
మాజీ రాష్ట్రపతి వినయం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న సమయంలోనూ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి తనను కారు వరకు వచ్చి సాగనంపేవారని చెప్పారు. అలాగే తన గ్రామం పర్యటనలో కోవింద్ తన గురువుల పాదాలకు నమస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ.. అది భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటిందని అన్నారు.
“విజయాలు వ్యక్తిగతం కాదు.. సమాజం భాగస్వామ్యం”
ఒక వ్యక్తి విజయాలను తన సొంత ఘనతగా భావించడం సాధారణమని.. కానీ సమాజం అందించిన సహకారాన్ని గుర్తించే వ్యక్తులే గొప్పవారని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథలో ఇదే భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు వ్యక్తిగతమైనప్పటికీ.. వాటి నుంచి వచ్చిన విజయాలు భారత ప్రజాస్వామ్య విజయాలని అభివర్ణించారు.
రీల్స్ వేగంలో జీవిత ప్రయాణాన్ని చిన్నదారిలో ముగించాలని చూస్తున్న యువతకు, మరీ ముఖ్యంగా జెన్‌జీకి.. అనుభవాల నుంచి నేర్చుకోవాలనే ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


