పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇప్పటివరకు కారణాలు అందరికీ తెలిసినవే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, పన్నుల భారం, ప్రపంచ పరిణామాల ప్రభావం. కానీ ఓ రాష్ట్రంలో ఇప్పుడు ఇంధనంపై పడిన కొత్త భారం మాత్రం వీటికి భిన్నం. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై అదనంగా 60 పైసలు వసూలు చేసే కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ప్రజలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూద్దాం..
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ‘విడో అండ్ ఆర్ఫన్ సెస్’ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. నేటి(ఆగస్టు 12) నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై అదనంగా 60 పైసలు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర పన్నుల, ఎక్సైజ్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ కొత్త సెస్ అమల్లోకి వచ్చింది. ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇంధనం విక్రయించే సమయంలోనే ఈ సెస్ వర్తిస్తుంది.
చిన్న మొత్తం.. కానీ పెద్ద చర్చ!
లీటర్‌కు 60 పైసల వసూలు.. ఈ సెస్‌కు చట్టపరంగా ఉన్న పరిమితి మాత్రం ఎక్కువ. ప్రభుత్వం అవసరమైతే లీటర్‌కు రూ.5 వరకు సెస్ విధించే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో ఈ మొత్తం మరింత పెరుగుతుందా? అనే చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం సంక్షేమమేనని చెబుతున్నప్పటికీ.. ప్రజలపై అదనపు భారం మోపుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
వితంతువుల కోసం.. కానీ అందరూ చెల్లించాల్సిందే!
ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వితంతువులు, అనాథల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. అయితే ఈ పన్నును చెల్లించేది మాత్రం ప్రతి ఒక్కరూ. పెట్రోల్ వినియోగించే సాధారణ ప్రజలు, ట్యాక్సీ డ్రైవర్లు, రైతులు, చిన్న వ్యాపారులు కూడా ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై పెట్రోలియం డీలర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇంధనం కొనుగోలు చేసే అవకాశం ఉందని, దాంతో రాష్ట్ర ఆదాయంపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అంతేకాదు.. ఈ సెస్ ద్వారా వచ్చే నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కూడా డీలర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమంది వితంతువులు, ఎంతమంది అనాథలకు ఈ నిధులు ఉపయోగపడతాయి? ఎంత మొత్తం ఖర్చు చేస్తారు? అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
హిమాచల్ ఆర్థిక పరిస్థితి కారణమా?
ఈ కొత్త సెస్ వెనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం భారీ అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల రుణ చెల్లింపుల భారం ఉంది. రాష్ట్ర అప్పులు లక్ష కోట్ల రూపాయలు దాటిన పరిస్థితుల్లో.. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు గ్రాంట్లలో మార్పులు కూడా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ ఇంధన సెస్‌లు
ఇంధనంపై ప్రత్యేక సెస్‌లు విధించడం హిమాచల్ ప్రదేశ్‌తోనే మొదలైన విషయం కాదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్లు, సామాజిక భద్రత, పర్యావరణం వంటి అంశాల కోసం పెట్రోల్, డీజిల్‌పై అదనపు సెస్‌లు వసూలు చేస్తున్నాయి. అయితే హిమాచల్ నిర్ణయంలో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సెస్‌ను నేరుగా వితంతువులు, అనాథల సంక్షేమం కోసం ఉద్దేశించినట్లు ప్రకటించడం.
సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరమే అయినప్పటికీ.. ప్రజలపై అదనపు పన్నుల భారం ఎంతవరకు సమంజసం? ఈ నిధులు నిజంగా లబ్ధిదారులకు చేరుతాయా? అనేది ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.


