ఇమ్రాన్‌ ఖాన్‌ మరణించారా? | pak journalist cites 3 military sources to claim ex pm may be dead | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ ఖాన్‌ మరణించారా?

Aug 12 2026 4:06 PM | Updated on Aug 12 2026 4:56 PM

 pak journalist cites 3 military sources to claim ex pm may be dead

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, PTI అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం విషయంలో ఈ దేశ జర్నలిస్టు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇమ్రాన్‌  జైలులోనే మరణించి ఉండొచ్చంటూ జర్నలిస్ట్‌ వజాహత్‌ సయీద్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు  కలకలం రేపుతున్నాయి. 

రావల్పిండిలోని ఆర్మీ జనరల్‌ హెడ్‌క్వార్టర్స్‌ లో ఉన్న ముగ్గురు సీనియర్‌ సైనికాధికారులు ఇమ్రాన్‌ ఖాన్‌ ఇక బతికి లేరని భావిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే ఈ సమాచారం ధ్రువీకరించబడలేదని, ఆ అధికారులు కూడా ఇమ్రాన్‌ మరణాన్ని ప్రత్యక్షంగా చూడలేదని జర్నలిస్ట్‌ స్పష్టం చేశారు.

2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇమ్రాన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించినా అనుమతి లభించడం లేదని ఆరోపిస్తోన్నారు.  ఇమ్రాన్‌కు స్వతంత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని పార్టీ డిమాండ్‌ చేస్తోంది. 

గత ఏడాది కూడా ఆయన జైలులో మరణించారంటూ పుకార్లు వచ్చాయి. అయితే డిసెంబర్‌ 2న ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలసి, ఆయన శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే భారీగా ఆందోళనలు చేపడతామని PTI హెచ్చరించింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి, PTI నేత సొహైల్‌ అఫ్రిది మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 20 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

యువతలో తీవ్ర ఆగ్రహం ఉందని, దాన్ని నియంత్రించడం అధికారులకు సాధ్యం కాదని హెచ్చరించారు. సెప్టెంబర్‌ 27న ఇస్లామాబాద్‌ వైపు భారీ లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు PTI ప్రకటించింది. అంతకుముందే ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు, ఆ తర్వాత అడియాలా జైలు ఎదుట నిరసనలు చేపట్టి, దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తామని అఫ్రిది వెల్లడించారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్బంధ పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 13 మంది అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఈ విషయమై లేఖ రాశారు. ఇమ్రాన్‌, ఆయన భార్య బుష్రా బీబీ నిర్బంధ పరిస్థితులపై పాకిస్థాన్‌తో చర్చించాలని కోరారు. 

ఇమ్రాన్‌ను రోజుకు 23 గంటల వరకు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారన్న ఆరోపణలు, ఆయన కుడి కంటికి తీవ్ర నష్టం జరిగిందన్న నివేదికలు, 85 శాతం చూపు కోల్పోయినట్లు న్యాయవాది చేసిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ మరణించినట్లు ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరించిన ఆధారం లేదు.

ఆయనను కలిసేందుకు ఆంక్షలు, ఆరోగ్యంపై ఆందోళనలు, సైనిక వర్గాల పేరుతో వచ్చిన ధ్రువీకరించని సమాచారం, PTI భారీ నిరసనలకు పిలుపు నేపథ్యంలో పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement