కాల్పుల తర్వాత కౌగిలింతలా? పీవోకేలో పొలిటికల్‌ గేమ్‌! | From Crackdown to Dialogue: Shehbaz Sharifs Sudden Shift in PoK | Sakshi
Sakshi News home page

కాల్పుల తర్వాత కౌగిలింతలా? పీవోకేలో పొలిటికల్‌ గేమ్‌!

Aug 11 2026 7:50 AM | Updated on Aug 11 2026 7:54 AM

From Crackdown to Dialogue: Shehbaz Sharifs Sudden Shift in PoK

పీవోకేలో ఆందోళనలు, భద్రతా చర్యల తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్వరం మార్చారు. నెలలుగా కొనసాగుతున్న నిరసనలపై కఠిన వైఖరి ప్రదర్శించిన ప్రభుత్వం.. ఇప్పుడు చర్చల ప్రతిపాదనతో ముందుకొచ్చింది. సమస్యలకు పరిష్కారం బలప్రయోగంలో లేదని, చర్చల ద్వారానే మార్గం కనుగొనాలని షెహబాజ్‌ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై నిరసనకారుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇటీవల పీవోకేలో జరిగిన తీవ్ర నిరసనలు, భద్రతా చర్యల నేపథ్యంలో షెహబాజ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్‌ ఛార్జీలు, ఆర్థిక నిర్లక్ష్యం, ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఆందోళనలు ఉధృతమయ్యాయి. అయితే “సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’’ అని షెహబాజ్‌ పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వం కూడా నిరసనకారులతో చర్చల ప్రక్రియను కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

క్రాక్‌డౌన్‌ తర్వాత మారిన స్వరం
పీవోకేలో రెండు నెలలకు పైగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  విద్యుత్‌ ధరల తగ్గింపు, ఆర్థిక సమస్యల పరిష్కారం, రాజకీయ సంస్కరణలు వంటి డిమాండ్లతో వారు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల్లో విద్యార్థులు, వ్యాపారులు, రవాణా కార్మికులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (JAAC)పై గతంలో కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే వర్గాలతో చర్చలకు సిద్ధమని ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిరసనకారులు మాత్రం ఇది సమస్యల పరిష్కారానికి నిజమైన ప్రయత్నమా? లేదంటే ఆందోళనల తీవ్రతను తగ్గించేందుకు చేస్తున్న వ్యూహమా? అని ప్రశ్నిస్తున్నారు.

‘అల్లర్లకు ప్రయత్నిస్తే సహించం’
చర్చలకు సిద్ధమని చెబుతూనే షెహబాజ్‌ హెచ్చరికలు కూడా చేశారు. శాంతియుతంగా తమ సమస్యలను చెప్పేవారితో చర్చిస్తామని, అయితే ప్రాంతంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం గతంలో కొందరు నిరసనకారులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణల ఆధారంగానే భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

ఎన్నికల వేళ రగిలిన అసంతృప్తి
పీవోకేలో ఎన్నికల ప్రక్రియ కూడా వివాదాలకు కారణమైంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని JAAC ఆరోపించింది. ఘర్షణలు, భద్రతా బలగాల చర్యల మధ్య ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికల్లో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (PML-N) ఆధిపత్యం సాధించినట్లు సమాచారం. 45 ఎన్నికైన స్థానాల్లో మెజారిటీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకున్నట్లు తెలుస్తోంది.

మృతుల సంఖ్యపై భిన్న వాదనలు
జూన్‌లో ప్రారంభమైన ఘర్షణల్లో కనీసం 11 మంది మరణించినట్లు అధికారిక పలు వార్తా కథనాల నివేదికలు చెబుతుండగా.. నిరసనకారుల వర్గాలు మాత్రం మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ గణాంకాలను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఖండిస్తోంది.

‘దేశభక్తులే’ అంటున్న పీఎంఎల్‌–ఎన్‌
షెహబాజ్‌ సన్నిహితుడు, పీఎంఎల్‌–ఎన్‌ నేత రానా సనావుల్లా కూడా నిరసనకారులపై స్వరం మార్చారు. JAACలో ఉన్న వారిలో 99 శాతం మంది దేశభక్తులేనని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

చర్చల వెనుక రాజకీయ లెక్కలు?
అణచివేతతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇప్పుడు చర్చల ప్రతిపాదన చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా అసంతృప్తిని తగ్గించడం, ప్రాంతంలో శాంతి నెలకొల్పడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అణచివేత తర్వాత చర్చల మాట ఎత్తిన షెహబాజ్‌ ప్రభుత్వం.. నిజంగా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తుందా? లేదంటే ఇది కేవలం రాజకీయ వ్యూహమా? అన్నది ఇప్పుడు పీవోకేలో ప్రధాన చర్చగా మారింది.

నెలల తరబడి నిరసనలను ఎదుర్కొనేందుకు కఠిన వైఖరి అవలంబించిన ప్రభుత్వం.. ఇప్పుడు శాంతి, చర్చల భాష మాట్లాడటం పీవోకేలో కొత్త చర్చకు దారితీసింది. విమర్శకులు దీనిని “ముందు అణచివేత.. తర్వాత సామరస్య పాఠాలు” అంటూ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement