source: X
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ క్రికెట్‌లో మళ్లీ తన పాత స్థానాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ టాప్-10లోకి తిరిగి వచ్చాడు.
దాదాపు రెండేళ్ల తర్వాత అతడు టాప్-10లో చోటు సంపాదించడం విశేషం. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో బాబర్ ర్యాంకింగ్ మెరుగుపడింది.
ఐదు స్థానాలు ఎగబాకి..
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. విదేశీ గడ్డపై టెస్ట్ విజయం కోసం పాక్ మూడేళ్లకు పైగా ఎదురుచూసింది. ఈ విజయంతో సిరీస్‌లోనూ పాక్‌కు కీలక ఫలితం దక్కింది.
ఈ మ్యాచ్‌లో బాబర్ తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ప్రదర్శనతో బాబర్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకున్నాడు.
సెప్టెంబర్ 2024 తర్వాత ఇదే తొలిసారి
బాబర్ ఆజం చివరిసారిగా 2024 సెప్టెంబర్ ప్రారంభంలో ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్నాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఒడిదుడుకులతో ర్యాంకింగ్స్‌లో క్రమంగా కిందికి పడిపోయాడు. ఇప్పుడు వెస్టిండీస్‌పై కీలక ఇన్నింగ్స్‌తో మరోసారి టాప్-10లోకి ప్రవేశించాడు.
బాబర్‌తో పాటు మరో ఇద్దరికీ లాభం
తాజా ర్యాంకింగ్స్‌లో బాబర్‌తో పాటు మరో ఇద్దరు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా మెరుగైన స్థానాలను అందుకున్నారు. చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ వెస్టిండీస్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శనకు ర్యాంకింగ్స్‌లో మంచి ఫలితం దక్కింది. అతడు ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరాడు.
బాబర్ మినహా టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. ట్రవిస్ హెడ్, హ్యారీ బ్రూక్, జో రూట్ టాప్-3 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్‌దే (7) టాప్ ర్యాంక్. యశస్వి జైస్వాల్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్, సిరాజ్, జడేజా వరుసగా 14 నుంచి 16 స్థానాల్లో నిలిచారు. పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ విండీస్‌తో రెండో టెస్ట్‌లో రాణించడంతో 5 స్థానాలు మెరుగుపర్చుకొని 30వ స్థానానికి చేరాడు.


