source: X
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక సిద్ధమవుతోంది. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. శ్రీలంక ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుతో తలపడేందుకు శ్రీలంక ఆటగాళ్లు ఇప్పటికే గాలేలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆతిథ్య జట్టు ఇద్దరు ఆసక్తికరమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మను బోల్తా కొట్టించిన బౌలర్ మళ్లీ వస్తున్నాడా..?
భారత్‌తో టెస్ట్ సిరీస్ కోసం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. రేవ్‌స్పోర్ట్జ్ నివేదిక ప్రకారం.. మధుశంకకు రీకాల్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
మధుశంకకు భారత్‌పై ప్రత్యేకమైన జ్ఞాపకం ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున అద్భుతంగా రాణించిన అతడు.. రోహిత్ శర్మను మ్యాచ్ రెండో బంతికే ఔట్ చేశాడు.
ఆ మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించిన సమయంలో మధుశంక అతడిని పెవిలియన్‌కు పంపించాడు. ఇప్పుడు మరోసారి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. మధుశంక ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.
గిల్, పంత్‌ను పడగొట్టిన కొత్త అస్త్రం
మధుశంకతో పాటు ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంతకు తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
ఇటీవల భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నువంత తన సత్తా చూపించాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రిషభ్ పంత్ వికెట్లను పడగొట్టాడు.
అంతేకాదు.. భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో నువంత ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన నువంత 64 వికెట్లు పడగొట్టాడు. అతని స్ట్రైక్‌రేట్ 39గా ఉంది. దీంతో భారత బ్యాటర్లకు అతడు మరో సవాలుగా మారే అవకాశం ఉంది.
ఇద్దరు కీలక బ్యాటర్లు దూరం
మరోవైపు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు.
దీంతో బ్యాటింగ్ విభాగంలో శ్రీలంకకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను తిరిగి టెస్ట్ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిక్వెల్లా చివరిసారిగా 2023 మార్చిలో శ్రీలంక తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
అదే సమయంలో అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ అంజలా బండారాను కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. డిక్వెల్లా, బండారా ఇద్దరూ ప్రస్తుతం గాలేలో శ్రీలంక జట్టుతో కలిసి ఉన్నట్లు సమాచారం.
WTC ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్‌ను ఓడించాల్సిందే..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. రెండు సిరీస్‌ల తర్వాత 41.67 శాతం పాయింట్లతో భారత్‌కు వెనుకనే ఉంది. శ్రీలంక ఇంకా ఎనిమిది టెస్టులు ఆడాల్సి ఉంది. WTC ఫైనల్‌కు చేరాలంటే భారత్‌పై సిరీస్ విజయం వారికి అత్యంత కీలకం.


