ఆండ్రీ రసెల్‌ అరుదైన ఘనత.. 'డబుల్' రికార్డు | Andre Russell Becomes CPL King, Breaks Mammoth Record Millions Aspire | Sakshi
Sakshi News home page

ఆండ్రీ రసెల్‌ అరుదైన ఘనత.. 'డబుల్' రికార్డు

Aug 12 2026 11:55 AM | Updated on Aug 12 2026 12:07 PM

Andre Russell Becomes CPL King, Breaks Mammoth Record Millions Aspire

source: X

38 ఏళ్ల వయసులోనూ తన పవర్‌హిట్టింగ్‌తో అదరగొడుతున్న వెస్టిండీస్‌ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ (CPL)లో మాత్రం సత్తా చాటుతున్నాడు.

2026 సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ నుంచి జమైకా కింగ్స్‌మెన్‌కు మారిన రసెల్‌.. బార్బడోస్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు.

2,000 పరుగులు.. 100 వికెట్లు
బార్బడోస్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందే రస్సెల్‌ CPLలో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మరో వికెట్‌ తీసి తన వికెట్ల సంఖ్యను 101కి పెంచుకున్నాడు.

అదే సమయంలో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి కేవలం 38 బంతుల్లో 9 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సీపీఎల్‌లో 2,000 పరుగులు పూర్తి చేశాడు.

తద్వారా CPL చరిత్రలో 2,000 పరుగులు, 100 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అలాగే CPLతో పాటు IPLలోనూ 2,000 పరుగులు, 100 వికెట్ల డబుల్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచి చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో రసెల్‌ రికార్డులు సాధించినా, అతడి జట్టు ఓటమిపాలవడం కొసమెరుపు. 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రసెల్‌ తన జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే చివరి దశలో అతడు ఔట్ కావడంతో కింగ్స్‌మెన్‌ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

కొత్త టాలెంట్‌ వెతుకుతున్నాడా..?
ఆటగాడిగా తన ప్రస్థానం ముగించిన రసెల్‌ ఇప్పుడు కోచ్‌గా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. IPLలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ పవర్ కోచ్‌గా ఉన్న అతడు.. CPLలో జమైకా తరఫున ఆడుతున్న యువ ఆటగాళ్ల ప్రదర్శనలను దగ్గరగా గమనిస్తున్నాడు.

19 ఏళ్ల విటెల్ లాస్‌ ఇప్పటికే తన ప్రతిభతో రసెల్‌ దృష్టిలో పడ్డాడు. లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన అతడు బార్బడోస్‌పై కేవలం 20 బంతుల్లో 32 పరుగులు చేసి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని కూడా చూపించాడు.

కీమో పాల్‌ కూడా బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్నాడు. గతంలో IPLలో ఆడిన అనుభవం అతడికి ఉంది.

రసెల్‌ రిటైర్మెంట్‌ తర్వాత అతడి తరహా ఆల్‌రౌండర్‌ను KKR ఇంకా పూర్తిగా భర్తీ చేయలేకపోయింది. అందుకే హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ నుంచి ట్రేడ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement