‘కెప్టెన్‌గా ఫెయిలైనా ఫిట్‌నెస్‌కు కొత్త అర్ధం చెప్పాడు’ | SA Legend Jonty Rhodes Hails-Kohli-Failed-Captain-But-Succeed-Fitness | Sakshi
Sakshi News home page

‘కెప్టెన్‌గా ఫెయిలైనా ఫిట్‌నెస్‌కు కొత్త అర్ధం చెప్పాడు’

Aug 12 2026 9:07 AM | Updated on Aug 12 2026 9:21 AM

SA Legend Jonty Rhodes Hails-Kohli-Failed-Captain-But-Succeed-Fitness

Photo Credit: Twitter

టీమిండియాలో ఫిట్‌నెస్‌, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఒక జట్టుగా ఉన్న రోటర్‌డామ్ డాకర్స్ జెర్సీని మంగళవారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాంటీ రోడ్స్‌తో పాటు కో-ఓనర్‌, మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్‌, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం హాజరయ్యారు. 

ఈ సందర్భంగా టీమిండియాలో పదునైన ఫీల్డింగ్, కెప్టెన్సీలో దూకుడు వంటి మార్పుల గురించి జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎంఎస్ ధోని కెప్టెన్ అయ్యాకా టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు జట్టులో ఉన్న సీనియర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇక కోహ్లి రాకతో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరగడంతో పాటు పదునైన ఫీల్డింగ్‌కు బాటలు పడ్డాయి. కోహ్లి కెప్టెన్‌గా అంతగా రాణించనప్పటికీ జట్టులో అందరూ ఫిట్‌గా ఉండాలని మాత్రం పట్టుబట్టేవాడు. 

ఎందుకంటే మైదానంలో ఒక మంచి ఫీల్డర్‌గా ఎదగాలంటే, ధృడంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరముంది. అందుకే కోహ్లి ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యమిచ్చేవాడు. ఇప్పటికీ అదే ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు. భారత జట్టులో గొప్ప ఫీల్డర్లు కొంతమందే ఉన్నారు. వారిలో కోహ్లి అగ్రస్థానంలో ఉంటాడనంలో సందేహం లేదు. 

ఇక ఫీల్డింగ్‌లో నేను ప్రాణం పెట్టేవాడిని. ఎంత ఒత్తిడి ఉన్నా మైదానంలో మాత్రం స్వేచ్ఛగా ఉండేవాడిని. 1993 హీరోకప్‌లో నేను ఐదు క్యాచ్‌లను సర్కిల్ లోపలే పట్టాను. అది ఒక అద్భతమని చెప్పొచ్చు. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా మారిన తర్వాత ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు చాలాకాలం పనిచేశాను. ఈ సమయంలో కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉండేది. 

బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి తోసేసి క్యాచ్ తీసుకున్న మొదటి ఆటగాడు అతడే. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫీల్డింగ్‌లో సరికొత్త మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జట్టులో ఒకరు లేదా ఇద్దరు బెస్ట్ ఫీల్డర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం నలుగురు నుంచి ఐదుగురు బెస్ట్ ఫీల్డర్లు ఉంటున్నారు.’ అని చెప్పుకొచ్చాడు.

ఇదే మంచి అవకాశం
ఇక 2027 వన్డే ప్రపంచకప్‌కు నమీబియా,జింబాబ్వేలతో కలిసి సౌతాఫ్రికా ఆతిథ్యమిస్తుండడంతో సఫారీ జట్టుకు గెలుపు అవకాశమెంత అనే దానిపై రోడ్స్ స్పందించాడు. ‘మాకు ఇదే సరైన సమయం. సౌతాఫ్రికా జట్టు చాలా బాగా ఆడుతోంది. ప్రపంచకప్ అనేది చాలా ప్రత్యేకమైనది. సొంతగడ్డపై ప్రపంచకప్ ఆడుతుండడం ఏ జట్టుకైనా బలమే. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మహాసంగ్రామానికి ఈసారి మేము ఆతిథ్యమివ్వనుండడం మాకు కలిసొస్తుందని అనుకుంటున్నా. చోకర్స్ ముద్రను చెరిపేసుకొని ఈసారి ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నాడు.

ఫీల్డింగ్‌కు కొత్త నిర్వచనం
ఇక 1992 నుంచి 2003 వరకు సౌతాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన జాంటీ రోడ్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరు పొందాడు. 1993 హీరోకప్‌లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో సర్కిల్ లోపలే ఐదు క్యాచ్‌లు పట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫీల్డింగ్‌కు సరికొత్త నిర్వచనం చెప్పిన జాంటీ రోడ్స్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ తన ఫీల్డింగ్‌తో 30 నుంచి 40 పరుగులు సేవ్ చేసి ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారాడు.

ఇంజమామ్‌ రనౌట్‌..
ఇక 1992 వన్డే ప్రపంచకప్‌లో పాక్ బ్యాటర్ ఇంజమామ్ ఉల్ హక్‌ను జాంటీ రోడ్స్‌ రనౌట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చిరుత కన్నా వేగంతో పరిగెత్తిన జాంటీ రోడ్స్‌ డైవ్ చేస్తూ బంతితో వికెట్లను గిరాటేసిన ఫొటో ఐసీసీ ఆల్ టైమ్ క్రికెట్ హిస్టరీ గ్యాలరీలో చేర్చింది. ఇక దక్షిణాఫ్రికా తరఫున జాంటీ రోడ్స్ 52 టెస్టుల్లో 2,523 పరుగులు, 245 వన్డేల్లో 5,935 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్లు కలిపి రోడ్స్ 139 క్యాచ్‌లు అందుకున్నాడు.

 

Read: ప్రేయసిని పెళ్లాడిన క్రిస్టియానో రొనాల్డో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement