Photo Credit: Twitter
అజింక్యా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో స్వదేశంలో కంటే విదేశీ టూర్లలో ఎక్కువగా రాణించిన రహానే సంతృప్తిగానే వీడ్కోలు పలికినట్లు పేర్కొన్నాడు. అయితే తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించిన సమయంలో సచిన్, కోహ్లి, రోహిత్‌లు తనకు ఫోన్‌కాల్ చేసి నిర్ణయంపై పునరాలోచన చేయాలని తెలిపారు.
కానీ ఆ ముగ్గురికి తాను ఒకటే సమాధానం చెప్పానని, ఇష్టపూర్వకంగానే తాను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వాళ్లకు చెప్పానని రహానే చెప్పుకొచ్చాడు. వీళ్లతో పాటు ఇర్ఫాన్ పఠాన్, బుమ్రా నుంచి కూడా తనకు సందేశాలు వచ్చాయని తెలిపాడు. రిటైర్మెంట్ వీడియోనూ పోస్టు చేసిన తర్వాత తనకు మొదటి కాల్ సచిన్ టెండూల్కర్ నుంచి వచ్చిందని రహానే వెల్లడించాడు.
'రహానే.. నువ్ ఇంకా ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడతావు అనుకున్నా' అని సచిన్ చెప్పినట్లు తెలిపాడు. ఇకపై క్రికెట్‌ను సాగదీయకుండా, ఎలాంటి అసంతృప్తి లేకుండా కెరీర్ ముగించాలనే నిర్ణయం తీసుకున్నానని సచిన్‌కు చెప్పినట్లు రహానే పేర్కొన్నాడు. ఇక మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రహానేకి ఫోన్ చేసి మాట్లాడాడు.
మరోవైపు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లు రహానేకి మెసేజెస్ అండ్ కాల్స్ చేశారు. అయితే వీరందరికీ రహానే ఒకటే సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. క్రికెట్‌కు తాను పూర్తిగా న్యాయం చేశాననే సంతృప్తితో ఉన్నానని, తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేసినట్లు రహానే వెల్లడించాడు.
కోహ్లి, పుజరాలతో ఉన్న బంధం గురించి రహానే స్పందించాడు. ‘దేశీయ క్రికెట్‌లో నేను, పుజారా చాలా కాలం కలిసి ఆడాము. అయితే, భారత్ తరఫున ఆడుతున్నప్పుడు నేను, విరాట్ ఎక్కువ సమయం కలిసి గడిపాము. కానీ మా మధ్య బంధం చాలా బలంగా ఉండేది. భారత టెస్ట్ జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లడమే మా ఉమ్మడి లక్ష్యం.
2015లో ఆరో, ఏడో ర్యాంకులో ఉన్న మేము, క్రమంగా నంబర్ 1 టెస్ట్ జట్టుగా ఎదిగాము. మేము నిరంతరం ఆట గురించి చర్చించుకుంటూ, విశ్లేషించుకుంటూ, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాము. చాంపియన్లుగా మారకముందు, టెస్టుల్లో మేమిద్దరం కలిసి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాము. అది ఎంతో ఆనందాన్నిచ్చింది.’ అని చెప్పుకొచ్చాడు.
రహానే తన 15 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 పరుగులు చేశాడు. అందులో 5077 రన్స్ టెస్ట్ క్రికెట్‌లో సాధించినవే కావడం గమనార్హం. అతడి పేరిట 12 టెస్టు సెంచరీలు ఉన్నాయి.


