టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి తారసపడేంత వరకు పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రుల మధ్య బలమైన స్నేహ బంధం ఉందని.. అదే వారి అన్యోన్య దాంపత్యానికి పునాది అని పేర్కొంది.
కాగా సచిన్ టెండుల్కర్ కెరీర్ తొలి నాళ్లలోనే డాక్టర్ అంజలితో ప్రేమలో పడ్డాడు. క్రికెటర్‌గా నిలదొక్కుకున్న తర్వాత ఇరుకుటుంబాలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వయసులో సచిన్ కంటే అంజలి ఆరేళ్లు పెద్ద. అయితే, ఇదేమీ వారి ప్రేమకు అడ్డంకి కాలేదు.
అక్క కంటే ముందే తమ్ముడి పెళ్లి
ముప్పై ఏళ్లకు పైగా వివాహ బంధంలో కొనసాగుతున్న సచిన్- అంజలి నేటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా తొలుత కుమార్తె సారా.. ఆ తర్వాత అర్జున్ జన్మించారు. సారా న్యూట్రీషనిస్ట్. అదే విధంగా మెడల్, కంటెంట్ క్రియేటర్‌గా కొనసాగుతూ.. వెల్‌నెస్ బిజినెస్‌లోనూ అడుగుపెట్టింది.
మరోవైపు.. అర్జున్ క్రికెటర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, అక్క సారా కంటే ముందే అర్జున్ పెళ్లి పీటలెక్కాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెప్పిన సానియా చందోక్‌తో ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. అయితే, 28 ఏళ్ల సారా ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది.
అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా
ఈ నేపథ్యంలో తాజాగా వోగ్ ఇండియాతో మాట్లాడిన సారా టెండుల్కర్ తన కాబోయే భర్త ఎలా ఉండాలన్న అంశంపై స్పందించింది. ‘‘నా తల్లిదండ్రులు భార్యాభర్తలు అవడానికంటే ముందు మంచి స్నేహితులు. ఇంట్లో వాళ్లిద్దరి సరదాగా గొడవపడుతూ ఉంటారు. వారిద్దరిని చూస్తే ముచ్చటేస్తుంది.
వారి బంధం అత్యద్భుతంగా అనిపిస్తుంది. నాకు కూడా అలా స్నేహంగా ఉండే భాగస్వామి రావాలని కోరుకుంటున్నా. నా ప్రాణ స్నేహితులంతా నా సోల్‌మేట్స్ అనే చెప్తాను. అయితే, నా పార్ట్‌నర్‌ను రొమాంటిక్ సోల్‌మేట్‌గా చూస్తాను’’ అని సారా పేర్కొంది.
ఇక జెన్ జీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘చాలా మంది త్వరత్వరగా నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి సమయం దగ్గరపడినపుడు ఒకవేళ.. సదరు వ్యక్తి తనకు సరైన భాగస్వామి అని అనిపించకపోతే.. నిర్భయంగా ఆ బంధాన్ని రద్దు చేసుకుంటున్నారు.
నచ్చకపోతే ఎంగేజ్‌మెంట్ కూడా రద్దు
ముందు తరాల వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు భయపడేవారు. కానీ జెన్ జీ నిక్కచ్చిగా తమ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తమకు ఏదైనా విషయం లేదంటే వ్యక్తి నచ్చలేదు.. సదరు వ్యక్తిలో తప్పు ఉందని భావిస్తే వెంటనే ఆ బంధం నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు.
జెన్ జీ ఆత్మవిశ్వాసం, సాధికారిత తమలో ఎక్కువని విశ్వసిస్తున్నారు’’ అని సారా పేర్కొంది. తాను కూడా తొందరపడి పెళ్లి బంధంలో అడుగుపెట్టబోనని.. సరైన పార్ట్‌నర్ దొరికినపుడే వివాహం చేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో సారా టెండుల్కర్ ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఇలాంటి వదంతులను పట్టించుకోనని సారా కొట్టిపారేసింది.


