PC: BCCI X
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ను భారత జట్టు సద్వినియోగం చేసుకుంది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.
ఈ నేపథ్యంలో గాలె వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా శ్రీలంకలోనూ టర్నింగ్ పిచ్‌లు ఉంటాయి.
అదరగొట్టిన జడ్డూ, మానవ్
ఇక వార్మప్ మ్యాచ్‌లో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అద్భుతంగా రాణించారు. లంక తొలి ఇన్నింగ్స్‌లో చెరో రెండు వికెట్లు తీసిన వీరిద్దరు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. మానవ్ 41 పరుగులు సాధించాడు.
తేలిపోయిన సారాంశ్
ఇక లంక రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ రెండు వికెట్లు తీయగా.. మానవ్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జడ్డూ 22 పరుగులు, మానవ్ 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అయితే, ఈ మ్యాచ్‌లో మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయాడు. పెద్దగా పరుగులు కూడా రాబట్టలేకపోయాడు.
మరోవైపు.. లంక తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలింగ్‌కు రాలేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తుదిజట్టులో ఈ నలుగురిలో ఎవరికి అవకాశం వస్తుందన్న అంశంపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులె స్పందించాడు.
కుల్దీప్‌నకు నో ఛాన్స్?!
‘‘గాలెకు చేరుకుని పిచ్‌ను పరిశీలించిన తర్వాతే తుదిజట్టుపై నిర్ణయం జరుగుతుంది. అయితే, మా జట్టులోని నలుగురు స్పిన్నర్లు ఎవరికి వారే ప్రత్యేకం. జడ్డూ అనుభవజ్ఞుడు. మానవ్ సుతార్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు.
ఇక సారాంశ్ జైన్ దేశీ క్రికెట్‌లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు ఎల్లప్పుడూ మణికట్టు స్పిన్నర్ అవసరం ఉంటుంది. మా నలుగురు స్పిన్నర్లు వైవిధ్యమైన బౌలర్లు. అయితే, పరిస్థితులకు తగ్గట్లే గాలెలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సాయిరాజ్ బహుతులె తెలిపాడు.
అందుకే బౌలింగ్ చేయలేదు
అదే విధంగా.. వార్మప్ మ్యాచ్‌లో లంక రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడంపై సాయిరాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘అతడు మెరుగ్గా ఆడాడు. వికెట్లు తీశాడు. అయితే, తనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు.
మిగిలిన వారికి కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించాడు. కుల్దీప్ దాదాపు 20 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. కాబట్టి రెస్ట్ తీసుకున్నాడు’’ అని సాయిరాజ్ తెలిపాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానుండగా.. ఇందుకు గాలె వేదిక.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.
చదవండి: గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే!


