శ్రీలంకతో తొలి టెస్ట్‌.. భారత తుది జట్టు ఇదే..! | India Strongest Playing XI For First Test Vs Sri Lanka After Warm Up Fixture | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో తొలి టెస్ట్‌.. భారత తుది జట్టు ఇదే..!

Aug 9 2026 8:11 PM | Updated on Aug 9 2026 8:33 PM

India Strongest Playing XI For First Test Vs Sri Lanka After Warm Up Fixture

source: BCCI X

భారత్‌-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆగస్ట్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది.

దీనికి ముందు శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మాంచి జోరు ప్రదర్శించింది. 

ఈ మ్యాచ్‌తో భారత్‌కు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. సాయి సుదర్శన్‌ గైర్హాజరీలో దేవదత్‌ పడిక్కల్‌ రూపంలో వన్‌ డౌన్‌లో మంచి ఆప్షన్‌ లభించింది. 

రెగ్యులర్‌ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్. కేఎల్‌ రాహుల్‌ ఆకట్టుకున్నారు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో సత్తా చాటాడు. 

ఈ మ్యాచ్‌లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని తొలి టెస్ట్‌లో టీమిండియా ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేద్దాం.

ఓపెనర్లు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్
తొలి టెస్ట్‌లో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరూ వార్మప్ మ్యాచ్‌లో పరుగులు సాధించడం సానుకూల అంశం. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. రాహుల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించగలడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో ఈ జోడీ కీలకంగా మారనుంది.

నంబర్‌ 3లో దేవదత్ పడిక్కల్
సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో నంబర్‌ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం దక్కడం ఖాయమైపోయింది. వార్మప్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన స్థానాన్ని కన్ఫర్మ్‌ చేసుకున్నాడు.

నాలుగో స్థానంలో గిల్‌
నంబర్‌ 4లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాని గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగి మంచి టచ్‌లో కనిపించాడు.

నంబర్‌ 5లో రిషభ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు విఫలమైనప్పటికీ.. టెస్టుల్లో భారత్‌కు ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాటర్లలో పంత్ ఒకడు. అందువల్ల అతడికి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమే.

నంబర్‌ 6లో ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించవచ్చు. వార్మప్ మ్యాచ్‌లో అతడూ పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ టెస్టుల్లో బ్యాటింగ్ లైనప్‌ను మరింత లోతుగా ఉంచాలన్న భారత వ్యూహంలో భాగంగా జురెల్‌ను ఆడించే అవకాశం ఉంది.

ఆల్‌రౌండర్లుగా జడేజా, సుతార్‌
ఆల్‌రౌండర్ స్థానాల్లో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడేజా టెస్టు క్రికెట్‌లో భారత్‌కు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. బ్యాటింగ్‌లో 38కు పైగా సగటుతో అతడు మిడిలార్డర్‌కు అదనపు బలం అందించగలడు.

మరోవైపు సుతార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సుమారు 26 సగటు కలిగి ఉన్నాడు. నంబర్‌ 8 వరకు బ్యాటింగ్‌ను తీసుకెళ్లడంతో పాటు స్పిన్ బౌలింగ్‌లోనూ అతడు ఉపయోగపడనున్నాడు.

స్పిన్ బాధ్యతలు కుల్దీప్‌వే
గాలే పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, సుతార్‌తో పాటు కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరించనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గాలేలో టర్నింగ్ పిచ్‌ లభిస్తే శ్రీలంక బ్యాటర్లకు అతడు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది. శ్రీలంకలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన కుల్దీప్.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.

పేసర్లుగా సిరాజ్, గర్నూర్ బ్రార్
తొలి టెస్ట్‌లో భారత్‌ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే.. సిరాజ​్‌తో పాటు గర్నూర్ బ్రార్‌కు అవకాశం లభించవచ్చు. బ్రార్‌ వార్మప్‌ మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు.

శ్రీలంకతో తొలి టెస్ట్‌కు టీమిండియా (అంచనా)
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్‌ బ్రార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement