శ్రీలంకతో తొలి టెస్ట్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ | Shubman Gill returns to batting after injury scare before SL Tests | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో తొలి టెస్ట్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌

Aug 9 2026 12:27 PM | Updated on Aug 9 2026 1:01 PM

Shubman Gill returns to batting after injury scare before SL Tests

PC: X.com

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్‌.  ప్రాక్టీస్ సెషన్‌లో కుడి చేతి వేలికి గాయం కావడంతో తొలి టెస్టుకు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉంటాడా?లేదా? ఆందోళ‌న అంద‌రిలోనూ నెల‌కొంది.

అయితే ఇప్పుడు గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అత‌డు తిరిగి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో కొలంబో వేదిక‌గా శ్రీలంక ఎలెవ‌న్‌తో జ‌రుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఈ చేతి వేలి గాయం కార‌ణంగానే తొలి రెండు రోజుల ఆట‌కు మాత్రం అత‌డు దూరంగా ఉన్నాడు. మూడో రోజు ఫీల్డింగ్ రాన‌ప్ప‌టికి బ్యాటింగ్ మాత్రం చేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. గిల్ గైర్హ‌జ‌రీలో భార‌త కెప్టెన్‌గా రాహుల్ వ్య‌హ‌రిస్తున్నాడు.

ఇప్ప‌టికే శ్రీలంక‌తో సిరీస్‌కు ఇన్‌ఫామ్ ప్లేయ‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, సాయిసుద‌ర్శ‌న్‌లు గాయం కార‌ణంగా దూర‌మ‌య్యారు. ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ కూడా తొలి టెస్ట్‌లో ఆడేది అనుమాన‌మే. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. శ్రీలంక జ‌ట్టు త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 363/8 డిక్లేర్ చేసింది.

మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త పేస‌ర్లు ఆక‌ట్టుకోలేక‌పోయారు.  కుల్దీప్ యాద‌వ్‌, జ‌డేజా, మాన‌వ్ సుతార్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌ను  357/6 వ‌ద్ద డిక్లేర్ చేసింది.  దేవ్‌దత్ పడిక్కల్ (164 బంతుల్లో18 ఫోర్లతో 142 ) భారీ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా 63 పరుగులు సాధించాడు. ఇక మూడో రోజు లంచ్ స‌మ‌యానికి శ్రీలంక 24 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement