PC: BCCI X
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ధీటుగా బదులిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ, గుర్నూర్ బ్రార్ మెరుపుల కారణంగా మంచి స్కోరు సాధించింది.
శ్రీలంక 363 డిక్లేర్డ్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా.. శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
ఫలితంగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్.. తొలిరోజు ఆటలో ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగులు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆటలో ఓవర్‌నైట్ స్కోరు వద్దనే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.
జైసూ, పంత్, జురెల్ విఫలం
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) పూర్తిగా విఫలమయ్యారు.
ఇలాంటి తరుణంలో నాలుగో స్థానంలో వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు.. మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ తోడయ్యాడు. జడ్డూ 117 బంతుల్లో 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరగా.. మానవ్ 90 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అయితే, అసంక మనోజ్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా మానవ్ వెనుదిరిగాడు.
గుర్నూర్ బ్రార్ మెరుపులు
ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి 15 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ 22 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. గుర్నూర్ బ్రార్ మెరుపులు మెరిపించాడు.
వరుస విరామాల్లో ఆటగాళ్లు పెవిలియన్ చేరిన తర్వాత పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. 103 పరుగులతో తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టిన పడిక్కల్.. ఆట ముగిసేసరికి మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు ఉన్నాయి.
ఆరు పరుగుల తేడా
ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ 142 పరుగులతో ఉండగా.. బ్రార్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ కంటే కేవలం ఆరు పరుగులు వెనుకబడి ఉంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఆదివారం చివరి రోజు.


