వీవీఎస్‌ లక్ష్మణ్‌తో సైకియా భేటీ.. కారణం ఇదే! | BCCI Top Official Rushes To Meet VVS Laxman Bengaluru For Urgent Review | Sakshi
Sakshi News home page

వీవీఎస్‌ లక్ష్మణ్‌తో సైకియా భేటీ.. కారణం ఇదే!

Aug 8 2026 5:57 PM | Updated on Aug 8 2026 6:39 PM

BCCI Top Official Rushes To Meet VVS Laxman Bengaluru For Urgent Review

హార్దిక్‌- హర్షిత్‌ (PC: BCCI)

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్‌ సైకియా.. హెడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌తో ఆదివారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హుటాహుటిన ఆయన బెంగళూరుకు బయల్దేరినట్లు సమాచారం. కాగా గత కొంతకాలంగా టీమిండియా గాయాల బెడదతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.

స్టార్‌ ఆటగాళ్లంతా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నారు. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌.. అదే విధంగా బౌలర్లు వరుణ్‌ చక్రవర్తి, ప్రిన్స్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆకాశ్‌ దీప్‌.. బ్యాటర్‌ సాయి సుదర్శన్‌  కూడా గాయాల నుంచి కోలుకోలేదు.

ఇక తొడకండరాల నొప్పితో బాధపడుతున్న హార్దిక్‌ పాండ్యా పరిస్థితిలో ఏమాత్రం పురోగతి లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేవజిత్‌ సైకియా బెంగళూరుకు వెళ్లి లక్ష్మణ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ వర్గాలు తాజాగా పీటీఐకి వెల్లడించాయి.

‘‘అవును.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా బెంగళూరులో వీవీఎస్‌ లక్ష్మణ్‌తో భేటీ అవుతారు. ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఆన్‌లైన్‌లో ఈ భేటీలో పాల్గొంటారనే సమాచారం ఉన్నా.. స్పష్టత మాత్రం లేదు.

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సమస్యల గురించి సైకియా- లక్ష్మణ్‌ చర్చిస్తారు. ఇద్దరూ కలిసి మీడియా ఎదుటకు వచ్చి అన్ని ప్రశ్నలకు బదులిస్తారు’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. కాగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE), టీమిండియా సెలక్టర్ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్‌ గురించి పూర్తి సమాచారం ఇవ్వకుండానే.. వారిని రిలీజ్‌ చేయడం సరికాదని సెలక్టర్లు హితవు పలికినట్లు సమాచారం. ఇటీవల హర్షిత్‌ రాణా.. తాజాగా బుమ్రా, సాయి సుదర్శన్‌ల ఫిట్‌నెస్‌ గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వకలేదని తెలుస్తోంది.

దీంతో వారిని తొలుత పలు సిరీస్‌లకు ఎంపిక చేసి.. ఆ తర్వాత వారి స్థానాలను వేరే వారితో భర్తీ చేయడంలో ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని CoE దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. బుమ్రా, సుదర్శన్‌ రిలీజ్‌ చేయడం వల్ల జట్టు ఎంపిక సమయంలో క్లారిటీ లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement