టీమిండియా టార్గెట్‌ 207 | India Set 207 Run Target In Sri Lanka Warm Up Game As Padikkal Shines With Unbeaten 142 Ahead Of Test Series, Check More Details | Sakshi
Sakshi News home page

టీమిండియా టార్గెట్‌ 207

Aug 9 2026 2:54 PM | Updated on Aug 9 2026 4:08 PM

Sri Lanka Cricket XI set 207 runs target to Team india in 3 day warm up match

source: BCCI X

శ్రీలంక క్రికెట్‌ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. లంక ఎలెవెన్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ఇవాళ (మూడో రోజు) చివరి రోజు కావడంతో ఫలితం తేలే అవకాశం లేదు. ఆటలో మరో సెషన్‌ మాత్రమే మిగిలి ఉంది.

లంక ఎలెవెన్‌ రెండో ఇన్నింగ్స్‌లో నిషాన్‌ మధుష్క (63 రిటైర్డ్‌ హర్ట్‌) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్‌ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ చెరో వికెట్‌ ద​క్కించుకున్నారు.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ (142 నాటౌట్‌) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్‌ హర్ట్‌) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్‌ రాహుల్‌ (40), మానవ్‌ సుతార్‌ (41), గుర్నూర్‌ బ్రార్‌ (36 నాటౌట్‌), సరాన్ష్‌ జైన్‌ (22 రిటైర్డ్‌ హర్ట్‌) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్‌, రమేశ్‌ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. నిషాన్‌ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్‌ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మానవ్‌ సుతార్‌ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ మ్యాచ్‌ గాలే వేదికగా ఆగస్ట్‌ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్‌ కొలంబో వేదికగా ఆగస్ట్‌ 23న ప్రారంభం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement