భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఐపీఎల్, జూనియర్ క్రికెట్‌లో దుమ్ములేపిన వైభవ్.. ఇప్పుడు సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.
తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైనప్పటికి జింబాబ్వే పర్యటనలో మాత్రం అదరగొట్టాడు. జింబాబ్వే బౌలర్లను ఎదుర్కోవడానికి అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్లు ఇబ్బంది పడినప్పటికి .. సూర్యవంశీ మాత్రం వారిని ఉతికారేశాడు. అంతకుముందు ఐపీఎల్‌లో కూడా వరల్డ్‌క్లాస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హేజిల్‌వుడ్, కమిన్స్‌ను కూడా వైభవ్ వదల్లేదు.
అయితే చిన్న వయసులోనే ఇంతటి పరిణతి సాధించడం వల్ల విదేశీ క్రికెట్ వర్గాలలో వైభవ్ వయస్సుపై ఇంకా సందేహలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ వయస్సుతో సంబంధం లేదని, అతడు ఎంత గొప్పగా క్రికెట్ ఆడుతున్నాడనే దానిపైనే అందరూ దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డాడు. 17 లేదా 18 ఏళ్లు ఉన్నా సరే పర్వాలేదు.
"వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడికి నిజంగా 15 ఏళ్లేనా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. కానీ నాకు అతడి వయసుతో సంబంధం లేదు. అతడు 15 ఏళ్ల కుర్రాడైతే చాలా సంతోషం. ఒకవేళ 17 లేదా 18 ఏళ్లు ఉన్నా సరే నాకు అనవసరం.
అతడు అత్యున్నత స్ధాయిలో ఎలా క్రికెట్ ఆడుతున్నాడన్నదే ముఖ్యం. టీమిండియాకు దొరికిన గొప్ప ఆణిముత్యం అతడు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తాడు. అతడు ఇప్పటికే వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్ ఐపీఎల్‌లో సత్తాచాటాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ నేను ఎప్పటికి మర్చిపోను.
ఆ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆడిన ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. వారు ఎంత వేగంతో బౌలింగ్ చేస్తే వైభవ్ అంతే అలవోకగా షాట్లు ఆడాడు. అతడి బ్యాట్ స్పీడ్ నిజంగా అద్భుతం. సరైన టైమింగ్ కూడా అతడి వద్ద ఉంది. అతను ఇప్పటికీ ఒక చిన్నపిల్లవాడే, అతనిపై అనవసర ఒత్తిడి పెట్టకుండా ఆడుకోనివ్వాలి" అని బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్‌లీ పేర్కొన్నాడు.


