వరల్డ్ అథ్లెటిక్స్ అండర్- 20 ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. శనివారం జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఆశిశ్ యాదవ్ రజతం సొంతం చేసుకోగా.. తాజాగా మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల హైజంప్ విభాగంలో బసంత్ కుమార్ మేఘ్వాల్ రజత పతకంతో మెరిశాడు.
తద్వారా వరల్డ్ అండర్20 ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే పురుషుల హైజంప్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి అథ్లెట్‌గా బసంత్ రికార్డులెక్కాడు. కాగా ఈ పోటోలో అల్జీరియాకు చెందిన యూనిస్ అయాచి, బసంత్ కుమార్, బ్రిటన్ అథ్లెట్ ఓటిస్ పూల్ ముగ్గురూ కూడా ఒకే హైట్ (2.21 మీటర్లు) జంప్ చేశారు.
కానీ ఈ హైట్‌ను అయాచి మొదటి ప్రయత్నంలోనే జంప్ చేయడంతో అతడికి స్వర్ణ పతకం దక్కింది. ఈ ఎత్తును బసంత్ రెండవ ప్రయత్నంలో జంప్ చేయడంతో రజత పతకం గెలుచుకున్నాడు.
మూడో ప్రయత్నంలోనే ఎగిరిన ఓటిస్ పూల్ కాంస్య పతకానికే పరిమితమయ్యాడు. మరోవైపు లాంగ్ జంప్‌లో షానవాజ్ ఖాన్ 7.84 మీ. దూకి కాంస్య పతకం సాధించాడు. అండర్20 ఛాంపియన్‌షిప్స్ లాంగ్‌జంప్‌లో కూడా భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.


