అరుదైన ఆన్సీ ముత్యం | India Ancy Sojan Breaks National Long Jump Record With 6. 88m Leap | Sakshi
Sakshi News home page

అరుదైన ఆన్సీ ముత్యం

Jul 2 2026 3:35 AM | Updated on Jul 2 2026 3:35 AM

India Ancy Sojan Breaks National Long Jump Record With 6. 88m Leap

కేరళలోని సముద్ర తీర గ్రామానికి చెందిన ఆ యువకుడు, అథ్లెట్‌గా పెద్ద స్థాయికి చేరుకోవాలని కలలు కన్నాడు. కలల మాటేమిటోగానీ, పేదరికం వల్ల చేతిలో ఆటో... 
ఆర్థిక కష్టాలు మాత్రమే మిగిలాయి.కట్‌ చేస్తే.... ‘నేను సాధించలేనిది మా అమ్మాయి సాధించింది’ అని ఆనందబాష్పాలు నిండిన కళ్లతో చెబుతున్నాడు ఆ తండ్రి. ఆ అమ్మాయి పేరు... ఆన్సీ సోజన్‌. ప్రఖ్యాత అథ్లెట్‌ అంజు బాబీ జార్జ్‌ పేరిట 22 ఏళ్లుగా ఉన్న 6.83 మీటర్‌ల సుదీర్ఘకాల జాతీయ రికార్డ్‌ను బ్రేక్‌ చేసి భారతదేశపు సరికొత్త లాంగ్‌–జంప్‌క్వీన్‌గా అవతరించింది...

భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 6.88 మీటర్‌లు దూకడం ద్వారా ‘వావ్‌’ అనిపించింది ఆన్సీ సోజన్‌. ఆమె తండ్రి సోజన్‌ ఈటీ ఒకప్పుడు అథ్లెట్‌. జాతీయ స్థాయిలో రాణించాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే పేదరికం అడుగడుగునా అతడి కలలకు అడ్డు పడింది. ఆటోడ్రైవర్‌ అయిన సోజన్‌ తన కలను కూతురు రూపంలో సాకారం చేసుకోవాలనుకున్నాడు.

పాటల ప్రపంచం నుంచి ఆటల లోకంలోకి...
ఆన్సీకి సంగీతం, డాన్స్‌ అంటే చాలా ఇష్టం. అయితే తండ్రి కోరిక మేరకు ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఆన్సీని అథ్లెటిక్స్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించడమే కాకుండా, ప్రాక్టీస్‌ సెషన్‌లకు తీసుకెళ్తూ ఉండేవాడు తండ్రి. ‘ఎన్నో సంవత్సరాల నా కల నెరవేరింది. ఆన్సీ ద్వారా నా కలను సాకారం చేసుకున్నాను. సంవత్సరాల తరబడి నా నిరీక్షణకు ఫలితం దక్కింది’ ఆనందంగా అంటున్నాడు సోజన్‌.

అతడి అంచనా అక్షరాలా నిజమైంది!
ఆన్సీ చిన్ననాటి కోచ్‌...సనోజ్‌. ఆన్సీ తండ్రిలాగే సనోజ్‌ కూడా ప్రతిభావంతుడైన అథ్లెట్‌. ఆర్థిక కారణాలతో పాటు ఇతరత్రా కారణాల వల్ల ఆయన కలలు అటకెక్కాయి. తన కలలు ఫలించకపోయినా, తనలా కలలు కనే యువత కలలను సాకారం చేయడానికి నడుం బిగించాడు సనోజ్‌. వారి కోసం చిన్న అథ్లెటిక్స్‌ అకాడమీని ప్రారంభించాడు. ఆన్సీకి పదమూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెలోని ప్రతిభను మొదటిసారిగా గుర్తించాడు సనోజ్‌. అండర్‌–14 స్టేట్‌ స్కూల్‌ గేమ్స్‌లో 4.93 మీటర్‌ల దూరం దూకి కాంస్య పతకం గెలుచుకున్న ఆన్సీ తన సహజ ప్రతిభతో ఔరా అనిపించుకుంది.

‘ఈ అమ్మాయి ఏదో ఒకరోజు రికార్డ్‌లు బ్రేక్‌ చేస్తుంది’ అనుకునేవాడు సనోజ్‌. సంవత్సరాల కాలం తరువాత అతడి అంచనా అక్షరాలా నిజమైంది. పంజాబ్‌లో జరిగిన జాతీయ పాఠశాలల అథ్లెటిక్స్‌ మీట్‌లో 6.26 మీటర్‌లు దూకినప్పుడు తొలిసారిగా జాతీయ గుర్తింపు పొందింది. అప్పటినుండి అథ్లెటిక్స్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. నట్టికాలోని ఒక సాధారణ సిరియన్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టింది ఆన్సీ. తల్లి ఝాన్సీ గృహిణి. ఆన్సీ కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఎన్నో ఉండేవి.

ప్రపంచ స్థాయి ప్రతిభ
‘ప్రపంచ స్థాయి ప్రతిభ’ అంటూ ఆన్సీని ప్రశంసించింది అంజు బాబీ జార్జ్‌. ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ్రపోత్సహించింది. ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో అంజు బాబీ రికార్డ్‌ నెలకొల్పినప్పుడు ఆన్సీ వయసు మూడేళ్లు మాత్రమే. అంజు నెలకొల్పిన రికార్డ్‌ భారత్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన రికార్డులలో ఒకటి. ఈ నేపథ్యంలో తాను ఎంత గొప్ప విజయం సాధించిందో ఆన్సికి బాగా తెలుసు. ఈ అరుదైన ఆణిముత్యం మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలని ఆశిద్దాం.                    

ఆటోడ్రైవర్‌ కూతురే కదా...అనేవాళ్లు!
పక్క ఊళ్లలో పోటీలు ఉంటే ఆన్సిని అక్కడికి తప్పకుండా తీసుకువెళ్లేవాడిని. పోటీలో ఉన్న నా కూతురిని చూస్తే ఎంతో సంతోషంగా ఉండేది. ఈ సంతోషంలో ఆటో కూడా నడిపేవాడిని కాదు. ఇలా అయితే ఎలా? అనేవాళ్లు చాలామంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావో మాకు అర్థం కావడం లేదు. ఆటోడ్రైవర్‌ కూతురు ఆటోడ్రైవర్‌ కూతురే. అంతకుమించి అనవసరంగా ఏమీ ఆశించకు... అని నా తోటి ఆటోడ్రైవర్లు నాతో అంటుండేవారు. కానీ నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు. మా అమ్మాయి ఏదో ఒకరోజు గొప్ప విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకం ఉండేది. – సోజన్, ఆన్సీ తండ్రి

నా కోసం నాన్న అప్పులు చేశారు
మా నాన్న ఆటోడ్రైవర్‌. పెద్దగా డబ్బులు ఉండేవి కాదు. అయినా సరే, నేను అథ్లెట్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చూశారు. నా కోసం స్నేహితుల దగ్గర అప్పులు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆయన నన్ను ఒక యువరాణిలా చూసుకున్నారు. నాన్నలో క్రీడాస్ఫూర్తి ఉంది. అంజూ మేడమ్‌ రికార్డ్‌ గురించి నాకు తెలుసు. కాని నేను దానిని బ్రేక్‌ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రపంచస్థాయి అథ్లెట్‌గా ఎదగాలనుకున్నాను. నేను మొదటిసారి కామన్వెల్త్‌గేమ్స్‌కు వెళ్లినప్పుడు, కొంతమంది అగ్రశ్రేణి అథ్లెట్లు ఎంత దూరం దూకుతున్నారో ప్రత్యక్షంగా చూశాను. వారి ప్రతిభ, సామర్థ్యాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. – ఆన్సీ సోజన్‌

బరువే అవరోధమై...
గత సంవత్సరం హార్మోన్ల సమస్య కారణంగా బరువు పెరిగింది ఆన్సి. ఆ బరువు ఆమె కెరీర్‌కు అవరోధంగా మారింది. ఆన్సి ఫామ్‌ ఊహించని విధంగా పడిపోయింది. వైద్యపరీక్షల తరువాత అసలు కారణం తెలుసుకుని ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఆహారనియమాలను పాటించింది. ‘నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ అటువంటి వాటిని నా ఆహార జాబితా నుంచి పూర్తిగా తొలగించాను. ప్రపంచ స్థాయి జంపర్‌గా ఎదగాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు’ అంటుంది ఆన్సి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement