ఇండియాకు చెందిన ఓ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్.. త రెండున్నర ఏళ్లలో రూ.6.5 కోట్లు ఆదా చేసినట్టు, తన మొత్తం నెట్ వర్త్‌ను రూ.1 కోటి నుంచి రూ.7.5 కోట్లకు పెంచుకున్నట్టు రెడ్డిట్‌లో పంచుకున్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
'From Rs 1 Cr at 34 to Rs 7.5 Cr at 37: My Middle East Consulting Journey' పేరుతో పెట్టిన ఈ పోస్టులో, 37 ఏళ్ల ఈ వ్యక్తి తన కెరీర్, ఆదాయం, పొదుపు, పెట్టుబడుల వివరాలను వివరంగా పంచుకున్నాడు. ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఈయన, ప్రస్తుతం ఒక ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు.
కెరీర్, జీతం ఎలా పెరిగాయంటే...
22 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేట్ ట్రైనీగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన, అప్పుడు ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించేవాడు. ఎంబీఏ పూర్తయ్యాక 26 ఏళ్లకు మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్‌లోకి అడుగుపెట్టాడు, అప్పటి వార్షిక ఆదాయం రూ.25 లక్షలు. 29 ఏళ్లకు మరో కెరీర్ మార్పుతో ఇండస్ట్రీ రోల్‌లోకి మారి, రూ.40 లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. తర్వాతి ఐదేళ్లలో జీతం క్రమంగా పెరుగుతూ రూ.65 లక్షలకు చేరింది. ఈ కాలంలోనే పీఎఫ్, బంగారం, స్టాక్స్, రియల్ ఎస్టేట్‌లలో పెట్టుబడులతో దాదాపు రూ.1 కోటి నెట్ వర్త్ సాధించాడు.
పశ్చిమాసియా మలుపు తిప్పిన సంపద
34 ఏళ్ల వయసులో మళ్లీ కన్సల్టింగ్ రంగంలోకి వెళ్లి, పశ్చిమాసియాకు మారిన ఈయన జీతం ఒక్కసారిగా రూ.3.5 కోట్లకు (సుమారు 4 లక్షల డాలర్లు) పెరిగింది. అదీ పన్ను లేకుండా. ఈ భారీ జీత పెరుగుదలే ఆదా వేగాన్ని పెంచింది. "ఇప్పుడు 37 ఏళ్ల వయసులో, గత రెండున్నర ఏళ్లలో దాదాపు రూ.6.5 కోట్లు ఆదా చేశాను, నా నెట్ వర్త్ రూ.7.5 కోట్లకు చేరింది" అని ఆయన పోస్టులో పేర్కొన్నాడు.
తన ప్రస్తుత ఆస్తుల గురించి కూడా వివరించాడు. ముంబైలో పూర్తిగా చెల్లించిన మూడు ప్రాపర్టీలు, భౌతిక బంగారం, సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో సుమారు 700 గ్రాముల బంగారం, ఈక్విటీల్లో దాదాపు రూ.30 లక్షల పెట్టుబడి ఉన్నట్టు తెలిపాడు. రాబోయే కాలంలో ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్ రెడ్డిట్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. కొందరు తమ కెరీర్, ఫైనాన్స్ గురించి సీరియస్‌గా ఆలోచించేలా ప్రేరణ ఇచ్చిందని చెప్పగా, మరికొందరు ఇంత సంపద సాధించడం వెనుక ఏళ్ల కృషి, కష్టమైన నిర్ణయాలు ఉంటాయని కొనియాడారు. అధిక జీతాలు, పన్ను మినహాయింపులతో మిడిల్ ఈస్ట్ సంపద నిర్మాణానికి 'చీట్ కోడ్' లాంటిదని కొందరు వ్యాఖ్యానించారు. విదేశాలకు మారడం ఎలా సాధ్యమైందో, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపారు.


