చుట్టమల్లే వివాదం.. ఇదేం తొలిసారి కాదు! | Janhvi Kapoor Chuttamalle AI Video: The Dark Side of Social Media Edits | Sakshi
Sakshi News home page

చుట్టమల్లే వివాదం.. ఇదేం తొలిసారి కాదు!

Oct 5 2026 1:56 PM | Updated on Oct 5 2026 2:01 PM

Janhvi Kapoor Chuttamalle AI Video: The Dark Side of Social Media Edits

ఓ సినిమా పాట.. ఓ హీరోయిన్‌.. ఓ వైరల్‌ వీడియో. చూస్తే ‘వార్నీ.. ఇంత ఘోరమా!’ అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. సినిమాలో లేని సన్నివేశం అది. జరగని ఘటన. నిజమైన వ్యక్తి చేయని పని. ఏఐతో తయారు చేసిన ఫేక్‌ కంటెంట్‌. అది నీచాతి నీచంగా!. అంతకు ముందు కూడా అంతే.. ఓ నటిని లిఫ్ట్‌లో డీప్‌ఫేక్‌ అనే సాంకేతికతతో అసభ్యకరంగా చూపించి వైరల్‌ చేశారు.

‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను ఆధారంగా చేసుకుని జాన్వీ కపూర్‌ను అశ్లీంగా చూపించేలా రూపొందించిన ఓ మార్ఫింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ తీవ్రంగా స్పందించారు. నీచుల్ని వదలబోనని అన్నారు. వీడియోను రూపొందించిన వారిపైనే కాకుండా.. దాన్ని ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

తాజాగా జాన్వీ కపూర్‌ కూడా స్పందించారు. తన అనుమతి లేకుండా ఇలాంటి కంటెంట్‌ రూపొందించి ప్రచారం చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఇది కేవలం ఓ మార్ఫింగ్‌ వీడియో కాదని.. తన గౌరవం, వ్యక్తిగత హద్దులను ఉల్లంఘించే చర్య అని పేర్కొన్నారు. చిరంజీవి, రామ్‌ పోతినేని, ఆర్జీవీ తదితరులు కూడా దీనిపై స్పందించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. చుట్టమల్లే వీడియో ఒక్కటేనా?.

కాదు. సోషల్‌ మీడియాలోకి వెళ్తే.. ఇది చాలా పెద్ద సమస్యలోని ఓ ఉదాహరణ మాత్రమేనని అర్థమవుతుంది. హీరోహీరోయిన్ల ఫొటోలు, సినిమా సన్నివేశాలు, ఇంటర్వ్యూలు, రీల్స్‌.. ఏదైనా సరే. వాటిని తీసుకుని మరో రూపంలోకి మార్చడం ఇప్పుడు చాలా సులభమైంది. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీల విషయంలో ఈ దుర్వినియోగం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖాన్ని మరో వ్యక్తి శరీరానికి జోడించడం.. అసలు లేని సన్నివేశాన్ని ఉన్నట్టుగా చూపించడం.. నిజమైన వీడియోలో ముఖాన్ని మార్చడం.. అశ్లీలంగా ఎడిట్‌ చేయడం.. ఇలా డీప్‌ఫేక్‌ల రూపాలు మారుతున్నాయి.

హీరోలకు ఒకలా.. వాళ్లకు మరోలా!
చుట్టమల్లే సాంగ్‌ ఘటనపై దుమారం రేగుతుండగానే.. మరో హీరోయిన్‌కు సంబంధించిన ఫేక్‌ కంటెంట్‌ బయటకు రావడం కూడా కనిపిస్తోంది. ఒకసారి వైరల్‌ అయిన ఫార్మాట్‌ను అనుకరిస్తూ కొత్త వీడియోలు తయారవుతున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా వెతికేవారు, మళ్లీ షేర్‌ చేసేవారు కూడా ఉంటున్నారు. ఇక్కడే మరో తేడా కనిపిస్తోంది.

హీరోలను టార్గెట్‌ చేస్తే సాధారణంగా ట్రోలింగ్‌, మీమ్స్‌, డైలాగ్‌ ఎడిట్లు కనిపిస్తాయి. కానీ మహిళా సెలబ్రిటీల విషయంలో అదే ట్రోలింగ్‌ చాలాసార్లు అశ్లీల మార్ఫింగ్‌, డీప్‌ఫేక్‌ల దిశగా వెళ్తోంది. అంటే సమస్య కేవలం ఫేక్‌ కంటెంట్‌ తయారు చేయడంలోనే లేదు. దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? ఎవరు షేర్‌ చేస్తున్నారు? అన్నదీ ఇప్పుడు కీలకంగా మారింది.

‘ఫేక్‌’ అని తెలిసినా కూడా..
డీప్‌ఫేక్‌లలో అత్యంత ప్రమాదకరమైన అంశం ఇదే. అది ఫేక్‌ వీడియో అని తెలిసినప్పటికీ.. “చూడండి ఎంత దారుణంగా ఉంది” అంటూ కొందరు దాన్ని మళ్లీ పోస్టు చేస్తారు. దీంతో అసలు వీడియోకు మరింత రీచ్‌ వస్తుంది. ఒక్కసారి సోషల్‌ మీడియాలో విస్తృతంగా వ్యాపించిన తర్వాత దాని కాపీలను పూర్తిగా తొలగించడం కూడా చాలా కష్టమవుతుంది. చుట్టమల్లే ఘటనలో ఎన్టీఆర్‌ “చూడొద్దు.. షేర్‌ చేయొద్దు.. ఎంగేజ్‌ కావొద్దు” అని చెప్పడానికి కారణం కూడా ఇదే. విమర్శించాలన్న ఉద్దేశంతోనైనా ఆ కంటెంట్‌ను మళ్లీ ప్రచారం చేస్తే.. తెలియకుండానే దాని వ్యాప్తికి సహకరించినట్టవుతుంది.

ఒక అకౌంట్‌ పోతే.. మరో అకౌంట్‌!
మరి సోషల్‌ మీడియా సంస్థలు ఎందుకు పూర్తిగా అడ్డుకోలేకపోతున్నాయి?. నిబంధనలు ఉన్నా.. ప్రతి పోస్టును వెంటనే గుర్తించడం అంత సులభం కాదు. ఒక అకౌంట్‌ను తొలగిస్తే మరో అకౌంట్‌ నుంచి అదే కంటెంట్‌ రావచ్చు. ఒక వీడియోను తీసేసేలోపే దాని కాపీలు ఇతర అకౌంట్లకు చేరిపోయే అవకాశం ఉంది.

ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఏఐతో రూపొందించిన లేదంటే మార్చిన సెలబ్రిటీ కంటెంట్‌ విస్తృతంగా చక్కర్లు కొట్టినట్టు పలు పరిశోధనలు గుర్తించాయి. కొన్ని సందర్భాల్లో అది ఏఐతో రూపొందించిందన్న విషయం కూడా స్పష్టంగా తెలియకుండా పోస్టు అవుతోంది. సోషల్‌ మీడియాలో మొదలైన కంటెంట్‌ అక్కడితో ఆగిపోవడం లేదు. ఇతర ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్‌ గ్రూపులు, మెసేజింగ్‌ చానెల్స్‌ ద్వారా కూడా మళ్లీ షేర్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఒక చోట తొలగించినా.. మరో చోట ప్రత్యక్షమవుతోంది. అందుకే ‘పోస్ట్‌ తొలగించాం’ అనడం వేరు.. ‘కంటెంట్‌ పూర్తిగా ఆగిపోయింది’ అనడం వేరు.

93 శాతం మహిళలే టార్గెట్‌!
ఇది కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన సమస్య కాదు. 2026లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న స్పష్టమైన లైంగిక డీప్‌ఫేక్‌ కంటెంట్‌లో దాదాపు 93 శాతం మహిళలను లక్ష్యంగా చేసుకున్నదే. అంతేకాదు.. ఇటువంటి కంటెంట్‌ పరిమాణం గత కొన్నేళ్లలో దాదాపు 900 శాతం పెరిగినట్టు నివేదిక పేర్కొంది. 

ఏఐ వచ్చాక మరింత ఈజీ
గతంలో ఇలాంటి ఫేక్‌ వీడియో తయారు చేయాలంటే ఎడిటింగ్‌ నైపుణ్యం, సమయం, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అవసరమయ్యేది. ఇప్పుడు జనరేటివ్‌ ఏఐ సాధనాలతో ఫొటోలు, వీడియోల్లో మార్పులు చేయడం చాలా సులభమైంది. దీంతో అసలు లేని దృశ్యాన్ని ఉన్నట్టుగా చూపించడం.. ఒక వ్యక్తిని మరో సన్నివేశంలోకి తీసుకురావడం.. ముఖాన్ని మార్చడం వంటి పనులు గతంతో పోలిస్తే చాలా తక్కువ శ్రమతోనే సాధ్యమవుతున్నాయి.

అదే సమయంలో డీప్‌ఫేక్‌లు, సింథటిక్‌ మీడియా, అశ్లీల లేదా లైంగికంగా స్పష్టమైన ఫేక్‌ కంటెంట్‌పై ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతలను పెంచే చర్యలపై ప్రభుత్వం కూడా దృష్టి పెడుతోంది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించడం వంటి అంశాలు ఇందులో కీలకం.

ఈరోజు జాన్వీ.. రేపు ఎవరు?
అందుకే ‘చుట్టమల్లే’ వివాదాన్ని కేవలం జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియోగా చూస్తే అసలు సమస్య కనిపించదు. ఇది సెలబ్రిటీ ఫొటోల దుర్వినియోగం.. ఏఐ మార్ఫింగ్‌.. డీప్‌ఫేక్‌లు.. అశ్లీల కంటెంట్‌.. సోషల్‌ మీడియా ట్రోలింగ్‌.. వైరల్‌ కల్చర్‌ అన్నీ కలిసిన పెద్ద సమస్యకు మరో ఉదాహరణ. ఒక వీడియోను ఎవరు తయారు చేశారు? అన్నదే కాదు.. దాన్ని ఎవరు వైరల్‌ చేస్తున్నారు? ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు? తొలగించిన తర్వాత మళ్లీ ఎలా ప్రత్యక్షమవుతోంది? అన్నదీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ‘చుట్టమల్లే’.. రేపు మరో హీరోయిన్‌ కావచ్చు. మరో సెలబ్రిటీ కావచ్చు. చివరికి సాధారణ వ్యక్తి కూడా బాధితుడిగా మారొచ్చు. టెక్నాలజీ వేగంగా మారుతున్నప్పుడు.. దాని దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థ కూడా అంతే వేగంగా మారాల్సిన అవసరాన్ని ఈ వివాదం మరోసారి గుర్తుచేస్తోంది.

ఇదీ చదవండి: AIని ఇక కంట్రోల్‌ చేయలేమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement