ఏఐపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో.. అదే స్థాయిలో దాని భద్రత గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. ఏఐ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం నుంచి, స్వయంగా కొన్ని పనులు పూర్తి చేసే స్థాయికి ఏఐ ఏజెంట్లు చేరుకుంటున్నాయి. అయితే.. ఇవి భవిష్యత్తులో మన నియంత్రణకు అందకుండా పోతే ఏమవుతుందనే ప్రశ్న ఇప్పుడు నిపుణులను ఆలోచింపజేస్తోంది.
భద్రత అవసరం
మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగి డేవిడ్ రాబిన్సన్ కూడా ఇదే విషయంపై హెచ్చరిక చేశారు. ది అట్లాంటిక్ మ్యాగజైన్‌లో రాసిన వ్యాసంలో.. ఏఐ పరిశ్రమ అనేది విమానయాన రంగం లేదా అణు విద్యుత్ రంగం మాదిరిగా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
విమానంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు అది పెద్ద ప్రమాదంగా మారకుండా.. అనేక భద్రతా వ్యవస్థలు ఉంటాయి. ఒక వ్యవస్థ పనిచేయకపోయినా మరో వ్యవస్థ ప్రమాదాన్ని అడ్డుకునేలా ఏర్పాట్లు చేస్తారు. అణు విద్యుత్ కేంద్రాల్లో కూడా ఇలాంటి అనేక రక్షణ పొరలు ఉంటాయి. ఏఐ విషయంలో కూడా ఇలాంటి జాగ్రత్తలు అవసరమని రాబిన్సన్ చెబుతున్నారు.
ఓపెన్ఏఐలో రాబిన్సన్
రాబిన్సన్ ఆందోళనకు ప్రధాన కారణం ఏఐ అభివృద్ధి వేగంగా పెరగడమే. కంపెనీలు మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను త్వరగా విడుదల చేయాలని పోటీ పడుతున్నాయి. కానీ.. టెక్నాలజీని ఎంత వేగంగా అభివృద్ధి చేస్తున్నామో, అదే స్థాయిలో దాని భద్రతను కూడా అభివృద్ధి చేస్తున్నామా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
రాబిన్సన్ ఓపెన్ఏఐలో సుమారు మూడున్నర సంవత్సరాలు పనిచేశారు. అధునాతన ఏఐ మోడళ్లను విడుదల చేసే సమయంలో.. వాటికి సంబంధించిన భద్రతా నివేదికల తయారీలో ఆయన పనిచేశారు. అంతే కాకుండా.. ఓపెన్ఏఐ ఫ్రేమ్‌వర్క్ రూపకల్పనలో కూడా ఆయన పాత్ర ఉంది.
మరో ముఖ్యమైన విషయం.. ఏఐ అలైన్‌మెంట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఏఐ మనుషులు కోరుకున్న విధంగానే పనిచేయాలి. మన విలువలు, నియమాలు, ఆదేశాలను గౌరవించేలా ఏఐని తయారు చేయడమే అలైన్‌మెంట్. కానీ ఏఐ పరిశ్రమ ఈ సమస్యను ఇంకా పూర్తిగా పరిష్కరించలేదని రాబిన్సన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: AIతో ఉద్యోగాలకు ముప్పు.. కానీ వీరు మాత్రం సేఫ్!


