ఏడాది పాటు చాట్‌జీపీటీ ఉచితం! | OpenAI Offers 1 Year of Free ChatGPT Plus Indian Researchers Eligibility details | Sakshi
Sakshi News home page

ఏడాది పాటు చాట్‌జీపీటీ ఉచితం!

Nov 17 2026 6:17 PM | Updated on Nov 17 2026 6:44 PM

OpenAI Offers 1 Year of Free ChatGPT Plus Indian Researchers Eligibility details

దేశంలోని విద్యా, శాస్త్రీయ పరిశోధనా రంగానికి ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రతిష్ఠాత్మక ‘చాట్‌జీపీటీ ఫర్‌ అకడమిక్‌ రిసెర్చర్స్‌’ కార్యక్రమాన్ని భారత్‌కు విస్తరిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా అర్హులైన భారతీయ పరిశోధకులకు 12 నెలల పాటు చాట్‌జీపీటీ ప్లస్‌(ChatGPT Plus) సేవలు పూర్తిగా ఉచితంగా లభించనున్నాయి.

తొలి 50 వేల మందికే అవకాశం

ఇటీవల ఓపెన్‌ఏఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కార్యక్రమం తదుపరి విడతలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 50 వేల కొత్త గ్రాంట్లను కేటాయించనున్నారు. గతంలో అనుసరించిన లాటరీ విధానానికి స్వస్తి పలికి ఈసారి అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన తొలి 50 వేల దరఖాస్తులకు ప్రాధాన్యత క్రమంగా గ్రాంట్లు మంజూరు చేయనున్నారు. నవంబర్ 23, 2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఒక్కో గ్రాంట్ కింద ఒక ప్రధాన పరిశోధకుడితో పాటు అదే సంస్థకు చెందిన మరో ఇద్దరు సహచరులకు కలిపి మొత్తం మూడు చాట్‌జీపీటీ ప్లస్‌ సీట్లు ఏడాది పాటు ఉచితంగా అందుతాయి. తద్వారా మొత్తం 2 లక్షల మంది పరిశోధకులకు సేవలు అందించాలన్నది సంస్థ లక్ష్యం. జులైలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యానికి ఇది రెట్టింపు కావడం విశేషం.

అర్హత ప్రమాణాలు ఇవే..

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత మూడేళ్లలో తమ విభాగంలో కనీసం ఒక పరిశోధనా పత్రం ప్రచురితమై ఉండాలి. ముఖ్యంగా లైఫ్‌ సైన్సెస్‌, రసాయన శాస్త్రం, మెటీరియల్స్, కంప్యూటర్ సైన్స్, భూగోళ శాస్త్రాలు, ఇంజినీరింగ్, గణితం, భౌతిక శాస్త్రం విభాగాల్లో పరిశోధనలు చేస్తున్న వారికి ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారులు కేవలం విద్యా, శాస్త్రీయ అవసరాల కోసమే దీన్ని వినియోగించాల్సి ఉంటుంది. సంస్థ నిర్దేశించిన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది ఎంపిక ఉంటుంది.

పరిశోధన వేగం రెట్టింపు

సంక్లిష్టమైన శాస్త్రీయ పత్రాల విశ్లేషణ, కొత్త పరిశోధనా ప్రతిపాదనల రూపకల్పన, హైపోథసిస్‌ల పరీక్ష, కోడింగ్, డీబగ్గింగ్, భారీ డేటా విశ్లేషణ వంటి పనులను పరిశోధకులు వేగంగా పూర్తి చేసేందుకు ఈ ఏఐ టూల్ దోహదపడుతుంది. కేవలం సాఫ్ట్‌వేర్ ఇవ్వడమే కాకుండా దాని సమర్థ వినియోగంపై ప్రత్యేక శిక్షణ, ప్రపంచవ్యాప్త పరిశోధకులతో అనుభవాలు పంచుకునే వేదికలను కూడా ఓపెన్‌ఏఐ కల్పించనుంది. అయితే, ఈ గ్రాంట్ కింద కేవలం చాట్‌జీపీటీ సేవలు మాత్రమే లభిస్తాయని, ఓపెన్‌ఏఐ ఏపీఐ క్రెడిట్లు ఇందులో భాగం కావని సంస్థ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: తండ్రికి నోటీసులు పంపిన కూతురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement