రెండో రోజూ మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం
ఔట్‌లుక్, టీమ్స్ సేవలకు విఘాతం
ప్రభుత్వాలు, కంపెనీల కార్యకలాపాలపై ప్రభావం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సర్వీసులకు రెండో రోజైన శుక్రవారం కూడా అంతరాయాలు కొనసాగాయి. ఔట్‌లుక్, టీమ్స్‌లాంటి సేవలు నిల్చిపోవడంతో ఆసియా నుంచి అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యూజర్లతో పాటు ప్రభుత్వాలు, కంపెనీల కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఎక్స్చేంజ్ ఆన్‌లైన్, ఈమెయిల్‌తో ముడిపడి ఉన్న పలు మైక్రోసాఫ్ట్ 365 సేవలకు విఘాతం ఏర్పడినట్లు సంస్థ తెలిపింది. వీటిలో ఔట్‌లుక్, టీమ్స్, ఏఐ అసిస్టెంట్ కోపైలట్‌లాంటి సేవలు ఉన్నాయి.
భారత్‌లో..
మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో అంతరాయాల వల్ల తమ ఈమెయిల్ సపోర్ట్ సేవలపై ప్రభావం పడిందని దేశీ విమానయాన సంస్థ ఇండిగో.. సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. అయితే, తమ ఫ్లయిట్ ఆపరేషన్స్, ఇతర కార్యకలాపాలు యథాప్రకారంగానే కొనసాగుతున్నట్లు వివరించింది. అటు ఎయిరిండియా తమ ఈమెయిల్ సర్వీసులను తాత్కాలికంగా ఇతర మాధ్యమాలకు మళ్లించినట్లు, ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ పడలేదని వివరించింది.
అటు ఆకాశ ఎయిర్ ఈమెయిల్ సపోర్ట్ సర్వీసులకు కూడా విఘాతం ఏర్పడటంతో, తక్షణ అవసరాలున్న కస్టమర్లు తమ కస్టమర్ కేర్ సెంటర్ లేదా సోషల్ మీడియా ద్వారా సంప్రదించాలని కంపెనీ సూచించింది. సమస్యను సత్వరం పరిష్కరించేందుకు గ్లోబల్ టీమ్స్ కలిసి పని చేస్తున్నాయని నెట్‌వర్కింగ్ సైట్ లింక్డిన్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ పోస్ట్ చేశారు. పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత దీనిపై పూర్తి నివేదికను పబ్లిష్ చేస్తామని కంపెనీ వివరించింది.
ఔట్‌లుక్, ఎక్స్చేంజ్ ఆన్‌లైన్, టీమ్స్, షేర్‌పాయింట్, వన్‌డ్రైవ్, కోపైలట్, ప్లానర్, టు డు, డిఫెండర్, పర్‌వ్యూ సహా పలు ఉత్పత్తులు, సర్వీసులపై ఔటేజ్ ప్రభావం పడింది. ఈమెయిల్ ఖాతాల నుంచి వివిధ క్లౌడ్ ఆధారిత ఫైళ్లకు యాక్సెస్ నిల్చిపోవడంలాంటి సమస్యలు తలెత్తాయి.
అంతర్జాతీయంగా చూస్తే... మైక్రోసాఫ్ట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో వర్క్‌హార్స్ గ్రూప్ అనే అమెరికన్ టెక్నాలజీ కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన కార్యక్రమం కొంత వాయిదాపడింది. ఔటేజ్ వల్ల అమెరికన్ కస్టమర్ల నుంచి అప్‌డేట్‌లు రావడం లేదని, ఇది ఇలాగే కొనసాగితే ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉందని హాంకాంగ్‌కి చెందిన అల్యూమినియం కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ప్రభుత్వ ఈమెయిల్స్ నిల్చిపోయినట్లు సింగపూర్‌కి చెందిన గవర్నమెంట్ టెక్నాలజీ ఏజెన్సీ తెలిపింది. మైక్రోసాఫ్ట్ 365 సర్వీసులకు అంతరాయం వల్ల ఈమెయిల్స్‌తో పాటు కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడిందని ఫిలిప్పీన్స్ సుప్రీం కోర్టు పేర్కొంది.
ప్రభుత్వ ఐటీ మౌలిక సదుపాయాలపై ప్రభావం పడిందని జపాన్ డిప్యూటీ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ మసానో ఒజాకీ తెలిపారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంలైన ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌లాంటివి కూడా సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇది 2024 నాటి క్రౌడ్‌స్ట్రయిక్ ఉదంతంలాంటిది కావొచ్చని భావిస్తున్నట్లు ఆ్రస్టేలియా హోమ్ వ్యవహారాల శాఖ మంత్రి టోనీ బర్క్ తెలిపారు.
సరిచేయడంపై కంపెనీ కసరత్తు ..
పరిస్థితిని చక్కదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సమస్య మూలాన్ని కనుగొనేందుకు, బ్యాక్‌ఎండ్ సర్వర్ల నుంచి రికవర్ చేసేందుకు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికైతే దీనికి సైబర్‌దాడుల్లాంటివి కారణం కాకపోవచ్చని భావిస్తున్నట్లు వివరించింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం దాదాపు 43 కోట్ల మంది యూజర్లు మైక్రోసాఫ్ట్ 365 యాప్‌లను ఉపయోగిస్తున్నారు. 1,30,000 మంది ఔట్‌లుక్ యూజర్లకు గురువారం సమస్యలు ఎదురైనట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో భారీ ఔటేజ్‌లు..
క్లౌడ్‌ఫ్లేర్: వెబ్ ట్రాఫిక్‌లో అయిదో వంతు వాటాను హ్యాండిల్ చేసే ఈ వెబ్ ఇన్‌ఫ్రా సంస్థ సర్వీసులకు 2025 నవంబర్ 18న అంతరాయం ఏర్పడింది. దీనితో వేల మంది యూజర్లకు కన్వా, ఎక్స్, చాట్‌జీపీటీలాంటి ప్లాట్‌ఫాంలు అందుబాటులో లేకుండా పోయాయి.
ఏడబ్ల్యూఎస్: ప్రపంచవ్యాప్తంగా కంపెనీల అప్లికేషన్లు, కంప్యూటర్ ప్రాసెస్‌లను హోస్ట్ చేసే అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ విభాగం సేవలకు 2025 అక్టోబర్ 20న విఘాతం ఏర్పడింది. ఫలితంగా అంతర్జాతీయంగా పలు పరిశ్రమల కార్యకలాపాలతో పాటు రెడిట్, స్నాప్‌చాట్‌లాంటి పాపులర్ యాప్స్‌పై ప్రభావం పడింది.
క్రౌడ్‌స్ట్రయిక్: 2024లో జూలై 19న ఈ గ్లోబల్ సైబర్‌సెక్యూరిటీ సంస్థ ఒక సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంతో మైక్రోసాఫ్ట్ కస్టమర్ల సిస్టంలపై ప్రభావం పడింది.
ఎక్స్ కార్ప్: 2022 డిసెంబర్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ (ఎక్స్) పలు సర్వీసులు, ఫీచర్లు గంటల తరబడి
నిల్చిపోయాయి.
మెటా: కాన్ఫిగరేషన్‌లో తప్పిదాల వల్ల 2021 అక్టోబర్ 4న ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు దాదాపు ఆరు గంటలు నిల్చిపోయాయి.


