మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం ఇప్పట్లో పూర్తిగా పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలెట్, మైక్రోసాఫ్ట్ 365 సేవలు సరిగ్గా పనిచేయక లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు.
సంస్థ దీనిపై స్పందిస్తూ.. పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని వెల్లడించింది. దీంతో మరో ప్రత్యామ్నాయ మార్గంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా.. చాలామంది అవుట్‌లుక్‌లో తమ ఇన్‌బాక్స్‌లను ఓపెన్ చేయలేకపోతున్నారు. ఈమెయిల్స్ పంపడం, స్వీకరించడం కూడా కష్టంగా మారింది. మరోవైపు టీమ్స్, కోపైలెట్ మాత్రమే కాకుండా.. ఇతర మైక్రోసాఫ్ట్ 365 సేవల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి.
కారణం ఇదే..
అయితే.. ఈ సమస్యకు అసలు కారణం సర్వర్లపై పడిన అధిక లోడ్ అని కంపెనీ గుర్తించింది. మైక్రోసాఫ్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని కొన్ని సర్వర్లు ఆటోమేటెడ్ హెల్త్ చెకింగ్‌లో విఫలమయ్యాయి. దీంతో మిగిలిన సర్వర్లపై అదనపు భారం పడింది. అయితే యూజర్ల సంఖ్య ఒక్కసారిగా పెరగడం వల్ల ఈ సమస్య రాలేదని, కొన్ని సర్వర్లు పనిచేయకపోవడం వల్లే కనెక్టివిటీ సమస్యలు ఏర్పడ్డాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ అంతరాయం సాధారణ యూజర్లకే కాకుండా.. ప్రభుత్వ విభాగాలపైనా ప్రభావం చూపుతోంది. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఈమెయిల్ సేవల్లో సమస్యలు ఎదురవుతున్నట్లు ప్రకటించాయి. విదేశాంగ, వాణిజ్య శాఖ (DFAT) అత్యవసర ఆంక్షలకు సంబంధించిన విచారణల కోసం ఈమెయిల్‌కు బదులుగా ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించింది. అలాగే వ్యవసాయం, మత్స్య, అటవీ శాఖ (DAFF) తమ విభాగానికి సంబంధించిన ఈమెయిల్స్ పంపడం, స్వీకరించడంలో సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది.
దీంతో మైక్రోసాఫ్ట్ సేవలపై ఆధారపడుతున్న సంస్థలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి కంపెనీ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, సేవలు ఎప్పటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఇదీ చదవండి: బంగారం భారీ పతనం.. కొనేందుకు మంచి తరుణం!


