రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం | How Legendary 24-Carat Golconda Pink Diamond Sold for Rs 130 Cr | Sakshi
Sakshi News home page

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం

Nov 13 2026 10:10 AM | Updated on Nov 13 2026 10:30 AM

How Legendary 24-Carat Golconda Pink Diamond Sold for Rs 130 Cr

ప్రపంచ వజ్రాల మార్కెట్‌లో భారతదేశానికి చెందిన చారిత్రక గోల్కొండ వజ్రం తన వైభవాన్ని చాటుకుంది. సుమారు ఏడు దశాబ్దాలకు పైగా ఒకే కుటుంబం పరిధిలో భద్రంగా ఉన్న 24 క్యారెట్ల ‘బల్గారి పింక్‌’ డైమండ్‌ అంతర్జాతీయ వేలంలో సంచలన ధర పలికింది. ప్రముఖ వేలం నిర్వాహక సంస్థ క్రిస్టీస్‌ ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో నిర్వహించిన ‘మాగ్నిఫిసెంట్‌ జువెల్స్‌’ వేలంలో ఈ వజ్రం 12,086,000 స్విస్‌ ఫ్రాంక్‌లకు (14,809,761 అమెరికన్‌ డాలర్లు) అమ్ముడైంది. ప్రస్తుత మారకపు విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.130 కోట్లు. వేలానికి ముందు 10 మిలియన్ల నుంచి 15 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌ల మధ్య ధర పలుకుతుందని నిపుణులు అంచనా వేయగా అందుకు అనుగుణంగానే భారీ ధరకు ఇది విక్రయమైంది.

గోల్కొండ నుంచి రోమ్‌ నగరానికి..

ఈ వజ్రం కేవలం దాని ధర వల్ల మాత్రమే కాకుండా భారతదేశ చరిత్రతో ముడిపడి ఉన్న నేపథ్యం కారణంగానూ ప్రత్యేక గుర్తింపు పొందింది. 1950వ దశకంలో విక్రేత కుటుంబానికి చెందిన పూర్వీకులు భారతదేశంలోని గోల్కొండ ప్రాంతం నుంచి ఈ అరుదైన వజ్రాన్ని కొనుగోలు చేశారు. అనంతరం దీన్ని ఇటలీ రాజధాని రోమ్‌ నగరానికి తీసుకెళ్లి ప్రపంచ ప్రఖ్యాత ఆభరణాల సంస్థ ‘బల్గారి’ వద్ద ఉంగరంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి సుమారు 70 ఏళ్లకు పైగా బయటి ప్రపంచానికి కనిపించకుండా ఆ కుటుంబం వద్దే ఈ రత్నం ఉంది. దీన్ని తొలిసారిగా క్రిస్టీస్‌ వేలం వేదికపైకి తీసుకొచ్చారు.

‘పింక్‌ డైమండ్స్‌లో మోనాలిసా’

జెమాలజికల్‌ శాస్త్రవేత్తల వర్గీకరణ ప్రకారం ‘బల్గారి పింక్‌’కు అత్యున్నతమైన ‘ఫ్యాన్సీ ఇంటెన్స్‌ పింక్‌’ రంగు గ్రేడ్‌ లభించింది. అంతేకాకుండా ఇది అత్యంత స్వచ్ఛమైన ‘టైప్‌-2ఏ’ వజ్రాల కేటగిరీలోకి వస్తుంది. ప్రపంచంలోని మొత్తం రత్న నాణ్యత కలిగిన వజ్రాల్లో ఈ తరహా వజ్రాలు రెండు శాతానికంటే తక్కువగా ఉంటాయని క్రిస్టీస్‌ స్పష్టం చేసింది. దీనికి వీవీఎస్‌2 క్లారిటీ రేటింగ్‌ ఉండటం విశేషం. అంటే అత్యంత శక్తివంతమైన భూతద్దంతో చూసినా గుర్తించడం కష్టమయ్యేంత సూక్ష్మమైన అంతర్గత లోపాలు మాత్రమే ఇందులో ఉన్నాయి.

సహజ పింక్‌ వజ్రాల్లో ఉండే ‘నైట్రోజన్‌ వేకెన్సీ కేంద్రాలు’ వాటి ఆకర్షణీయమైన గులాబీ రంగుకు కారణమవుతాయని నిపుణులు వివరిస్తున్నారు. దీనికి తోడు ఈ వజ్రాన్ని విశాలమైన ముఖభాగాలు కలిగిన ‘ఎమరాల్డ్‌ కట్‌’ ఆకృతిలో సానబట్టడం వల్ల దాని కాంతి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ రంగు, ఆకృతి, చారిత్రక నేపథ్యాల సమ్మేళనం వల్లే క్రిస్టీస్‌ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ జ్యువెలరీ మాక్స్‌ ఫాసెట్‌ దీన్ని ‘పింక్‌ డైమండ్స్‌లో మోనాలిసా’గా అభివర్ణించారు.

ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement