కత్తితో పొడిచి.. డంబెల్‌తో మోది | Tragedy Incident In Golconda | Sakshi
Sakshi News home page

కత్తితో పొడిచి.. డంబెల్‌తో మోది

Jun 13 2026 5:28 AM | Updated on Jun 13 2026 5:28 AM

Tragedy Incident In Golconda

మసూద్‌

సొంత బావను చంపిన బావమరుదులు 

సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో ఘాతుకం

గోల్కొండ: సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో.. సొంత బావమరుదులే బంధువులతో కలిసి బావను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోల్కొండ కుమ్మర్‌వాడీకి చెందిన షేక్‌ మసూద్‌ అలియాస్‌ చాందిని మసూద్‌ (25) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌. మూడేళ్లుగా షేక్‌ మసూద్‌ యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం షేక్‌ మసూద్‌ తన బస్తీ కుమ్మర్‌వాడీకి చెందిన బేగం అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి మృతుడి బావమరుదులు, అత్త, ఇతర బంధువులు షేక్‌ మసూద్‌ను సూటిపోటి మాటలతో వేధించేవారు.

దీంతో మసూద్‌ వారి ఇంటికి రాకపోకలు మానేశాడు. దారిలో ఎక్కడైనా ఎదురైనప్పుడు మసూద్‌ బావమరుదులు మసూద్‌ను బెదిరించే వారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఫతేదర్వాజా నూరాని మసీదులో మసూద్‌ మధ్యాహ్నం ప్రార్ధనలు ముగించుకొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతడి బావమరుదులు అప్పు, జావేద్, వీరి బంధువు షేక్‌ సోహెల్‌తోపాటు మరో ఇద్దరు మహిళలతో మసూద్‌ ఇంటి ముందు కాపుకాసి ఉన్నారు. మసూద్‌ అక్కడికి రాగానే అతడిపై కత్తి, రాడ్‌తో దాడి చేశారు. ప్రాణభయంతో మసూద్‌ తన ఇంట్లోకి వెళ్లిపోయాడు.

అక్కడితో ఆగకుండా ఇంట్లోకి చొరబడి కత్తితో పాటు వ్యాయామం చేసే డంబుల్స్‌తో కొట్టడం ప్రారంభించారు. నిందితుల్లో ఒకరు కత్తితో షేక్‌ మసూద్‌ తలపై కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మసూద్‌ తండ్రి నిందితులను అడ్డుకోగా నిందితుల్లో ఒకరైన అప్పు అతడిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రక్తం మడుగులో కిందపడిపోయిన మసూద్‌ చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా నిందితుల్లో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement