సాక్షి, హైదరాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లోని మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం విడుదల చేసింది.
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయగా, అధికారులు ఇటీవలే వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు.
తాజాగా జనరల్ సర్జరీ – 174, జనరల్ మెడిసిన్ – 166, ఆర్థోపెడిక్స్ – 89, రేడియాలజీ – 71 చొప్పున మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ఎంహెచ్‌ఆర్‌బీ విడుదల చేసింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి, తుది ఫలితాలను ప్రకటించింది.ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నూతనంగా ఎంపికైన స్పెషలిస్ట్ డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, 24 విభాగాల్లో 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. నేటితో 1192 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులను మంత్రి ఆదేశించారు.


