ఢిల్లీ: కబ్జా కోర్లే హైడ్రా వద్దంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కబ్జా చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోమన్నారు. హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని రేవంత్ స్పష్టం చేశారు. నిన్న( సోమవారం, జూలై 27వ తేదీ) హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసలు హైడ్రానే వద్దనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
దీనిపై సీఎం రేవంత్ ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. కబ్జా కోర్లే హైడ్రా వద్దంటున్నారని, గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదల పెద్దలా? అని ప్రశ్నించారు. కబ్జా కోర్లకు మీడియా కూడా సహకరించకూడదన్నారు రేవంత్.
‘హైడ్రా పనులను కొనసాగించి తీరుతాం. కబ్జా కోర్లు హైడ్రావద్దంటున్నారు. కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం. ఎన్ కన్వెన్షన్ పేదలదా పెద్దలదా?, హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ. ఏ అధికారిని నియమించాలనే విచక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బిఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారు. కోర్టు తీర్పుని పరిశీలించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తాం. హైడ్రా కార్యాచరణ పైన మాకు పూర్తి స్పష్టత ఉంది. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.


