సొంత ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. కాబట్టి.. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనేటప్పుడు ధర, విస్తీర్ణం, నిర్మాణ నాణ్యత వంటి అంశాలు మాత్రమే కాకుండా.. ఆ ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాలను కూడా తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే మంచి ఫ్లాట్ ఉన్నా, చుట్టుపక్కల వాతావరణం సరిగ్గా లేకపోతే రోజూ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కథనంలో ఒక రియల్టర్ సూచించిన ఐదు రకాల ప్రాంతాల గురించి తెలుసుకుందాం.
రైల్వే ట్రాక్‌కు సమీపంలో..
రైల్వే ట్రాక్ పక్కన ఇల్లు కొనుగోలు చేస్తే.. నిత్యం రైళ్ల శబ్దంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున రైళ్లు వెళ్లేటప్పుడు వచ్చే భారీ శబ్దాలు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో రైళ్లు వెళ్లే సమయంలో వచ్చే ప్రకంపనలు కూడా ఇంట్లో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందుకే ఇల్లు కొనేముందు రైల్వే ట్రాక్‌కు ఎంత దూరంలో ఉందో పరిశీలించడం మంచిది.
డంపింగ్ యార్డులకు దగ్గరగా
చెత్తను సేకరించే డంపింగ్ యార్డులకు సమీపంలో ఇల్లు కొనడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అక్కడ పేరుకుపోయే చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో పాటు దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి పరిసరాలు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇంటిని ఫైనల్ చేసే ముందు సమీపంలో చెత్త డంపింగ్ ప్రాంతాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
మ్యారేజ్ ఫంక్షన్ హాళ్ల పక్కన
ఇంటి పక్కనే మ్యారేజ్ గార్డెన్ లేదా ఫంక్షన్ హాల్ ఉంటే కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే.. పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరిగినప్పుడు డీజేలు, లౌడ్ స్పీకర్ల శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ శబ్దాల వల్ల ఇంట్లో ప్రశాంత వాయతవరణం కరువవుతుంది. నిద్రపోవడం కష్టమవుతుంది. తరచూ ఫంక్షన్లు జరిగే ప్రాంతాల్లో నివసించడం కొందరికి ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకే ఫ్లాట్ కొనేముందు ఆ ఫంక్షన్ హాల్‌లో తరచుగా కార్యక్రమాలు జరుగుతాయా?, లేదా అని తెలుసుకోవాలి.
మురికి కాలువల పక్కన
ఓపెన్ డ్రైనేజీలు, మురికి కాలువలకు దగ్గరగా ఇల్లు కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు. ఇలాంటి ప్రాంతాల్లో దుర్వాసన, దోమలు, ఈగల సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మురుగు నీరు పొంగిపొర్లడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా మారడమే కాకుండా.. రాకపోకలకు కూడా ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ఇల్లు కొనేముందు ఆ ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థను తప్పనిసరిగా పరిశీలించాలి.
హైటెన్షన్ విద్యుత్ తీగలకు దగ్గరగా
హైటెన్షన్ విద్యుత్ లైన్లకు సమీపంలో ఉన్న ఇళ్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. విద్యుత్ తీగలకు, భవనాలకు మధ్య నిబంధనల ప్రకారం.. తగినంత దూరం ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు విద్యుత్ శాఖ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, అవసరమైన అనుమతులను పరిశీలించాలి.
ఇదీ చదవండి: ముగ్గురు స్నేహితుల సాహసం.. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!
ఇల్లు కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఈ ఐదు ప్రాంతాలతో పాటు.. శ్మశాన వాటికలు, వర్షాకాలంలో నీరు నిలిచిపోయే ప్రాంతాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు కొనేముందు ఒక్కసారి మాత్రమే వెళ్లి చూడకుండా ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లోనూ పరిసరాలను పరిశీలించాలి. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారితో మాట్లాడితే స్థానిక సమస్యల గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. వీలైతే వర్షం పడిన సమయంలోనూ ఆ ప్రాంతాన్ని సందర్శించాలి. ఎందుకంటే ఇల్లు కొనడం ఒక్కరోజు నిర్ణయం కావచ్చు.. కానీ అక్కడ నివసించేది జీవితాంతం.


