ముగ్గురు స్నేహితుల సాహసం.. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం! | How Three Engineers Turned A Denny Breakfast Table Into An Nvidia Empire | Sakshi
Sakshi News home page

ముగ్గురు స్నేహితుల సాహసం.. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

Nov 13 2026 7:47 AM | Updated on Nov 13 2026 8:02 AM

How Three Engineers Turned A Denny Breakfast Table Into An Nvidia Empire

ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచిన ఎన్విడియా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కంప్యూటర్ చిప్స్, సూపర్ కంప్యూటింగ్ రంగాల్లో దూసుకెళ్తోంది. చాట్‌జీపీటీ వంటి ఆధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధికి అవసరమైన శక్తివంతమైన చిప్స్‌ను ఈ సంస్థ తయారు చేస్తోంది. అయితే.. ఇంతటి గొప్ప సంస్థ ప్రయాణం ఒక పెద్ద కార్యాలయంలోనో, అత్యాధునిక ల్యాబ్‌లోనో ప్రారంభం కాలేదు. కేవలం ఒక సాధారణ రెస్టారెంట్‌లో.. ముగ్గురు ఇంజినీర్లు కూర్చొని జరిపిన చర్చలతో ప్రారంభమైంది.

ముగ్గురు ఇంజినీర్లు.. ఒక రెస్టారెంట్
1992-1993 ప్రాంతంలో జెన్సన్ హువాంగ్, క్రిస్ మలాచోవ్‌స్కీ, కర్టిస్ ప్రియమ్ అనే ముగ్గురు ఇంజినీర్లు కలిసి ఒక కొత్త కంపెనీని ప్రారంభించాలని ఆలోచించారు. వీరిలో క్రిస్ మలాచోవ్‌స్కీ, కర్టిస్ ప్రియమ్ సన్ మైక్రోసిస్టమ్స్ సంస్థలో పనిచేస్తుండగా, జెన్సన్ హువాంగ్ ఎల్ఎస్ఐ లాజిక్ అనే కంపెనీలో పనిచేసేవారు.

తాము పనిచేస్తున్న కంపెనీలకు తెలియకుండా.. స్వతంత్రంగా ఒక కొత్త వ్యాపార ఆలోచనపై చర్చించుకోవడానికి వీరు సిలికాన్ వ్యాలీలోని డెన్నీస్ రెస్టారెంట్‌ను ఎంచుకున్నారు. ముగ్గురూ గంటల తరబడి అక్కడ కూర్చొని కంప్యూటర్ చిప్స్, భవిష్యత్తు టెక్నాలజీ, కొత్త కంపెనీ ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించేవారు. అలా గంటలపాటు చర్చలు జరుపుతూ.. 10 కప్పుల కాఫీ తాగేవాళ్లం అని క్రిస్ మలాచోవ్‌స్కీ పేర్కొన్నారు.

భవిష్యత్తు కంపెనీ గురించి చర్చ
వారి సమావేశం, చర్చలు ఎక్కువ సమయం కొనసాగడంతో రెస్టారెంట్ సిబ్బంది వారిని సాధారణంగా కూర్చునే బూత్ నుంచి వెనుకవైపు ఉన్న ఒక ప్రత్యేక గదికి మార్చారు. ఆ గదిలో.. శాన్ జోస్ పోలీసు అధికారులు తమ కేసులకు సంబంధించిన నివేదికలు రాస్తుంటే, మరోవైపు ఈ ముగ్గురు ఇంజినీర్లు ల్యాప్‌టాప్‌లతో కూర్చొని తమ భవిష్యత్తు కంపెనీ గురించి చర్చించేవారు. వీరి లక్ష్యం ఏడాదికి 50 మిలియన్ డాలర్ల వ్యాపారం.

బాధ్యతలు ఇలా..
క్రిస్ మలాచోవ్‌స్కీ హార్డ్‌వేర్ డిజైన్ బాధ్యతలు చూసుకుంటే, కర్టిస్ ప్రియమ్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్‌పై దృష్టి పెట్టేవారు. జెన్సన్ మాత్రం వ్యాపార వ్యూహాలు, ఆర్థిక నిర్ణయాలను చూసుకునేవారు. ఎందుకంటే.. హువాంగ్‌కు వ్యాపారంపై మంచి అవగాహన ఉండేది. ఒక కంపెనీ ప్రారంభించడం మాత్రమే ఆయన లక్ష్యం కాదు. ఆ కంపెనీ భవిష్యత్తులో ఎంత ఆదాయం సంపాదించగలదు?, చిప్స్ తయారీకి ఎంత ఖర్చవుతుంది?, మార్కెట్‌లో పోటీ ఎలా ఉంటుంది?, లాభాలు ఎంత వస్తాయి?, అనే విషయాలను కూడా ఆయన ముందుగానే విశ్లేషించేవారు.

కర్టిస్ ప్రియమ్ ప్రకారం, జెన్సన్ హువాంగ్ ఒక కఠినమైన షరతు పెట్టారు. కొత్తగా ప్రారంభించే కంపెనీ ఏడాదికి కనీసం 50 మిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించే సామర్థ్యం కలిగి ఉండాలి. ఆ లక్ష్యం సాధ్యమవుతుందని నమ్మిన తర్వాతే స్టార్టప్‌లో అడుగుపెట్టారు. వారి ప్రధాన ఆలోచన కంప్యూటర్ గ్రాఫిక్స్ నాణ్యతను మెరుగుపరిచే చిప్స్ తయారు చేయడం. ముఖ్యంగా వీడియో గేమ్స్‌లో ఉపయోగించే 3D గ్రాఫిక్స్‌ను మరింత స్పష్టంగా, వేగంగా చూపించగలిగే టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకున్నారు.

Nvidia పేరు ఎలా వచ్చిందంటే..
ఇక కంపెనీకి పేరు పెట్టే సమయంలో కూడా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మొదట 'Nvision' అనే పేరు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ పేరుతో ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉండటంతో మరో పేరు కోసం వెతికారు. చివరకు కర్టిస్ ప్రియమ్ ఒక లాటిన్ నిఘంటువులో 'Invidia' అనే పదాన్ని గుర్తించారు. దానికి అసూయ (Envy) అనే అర్థం ఉంది. ఆ పదంలోని మొదటి అక్షరాన్ని తొలగించి 'Nvidia' అనే పేరు రూపొందించారు. అలా ప్రపంచానికి పరిచయమైన ఎన్వీడియా సంస్థకు పేరు ఖరారైంది.

కుటుంబ సభ్యులకే నమ్మకం కలగలేదు!
ఒక కొత్త కంపెనీ ప్రారంభించడం అనేది ఎప్పుడూ సులభమైన విషయం కాదు. ముఖ్యంగా మంచి ఉద్యోగాన్ని వదిలేసి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని వ్యాపారంలోకి అడుగుపెట్టడం పెద్ద సాహసమే. జెన్సన్ హువాంగ్ తన ఉద్యోగాన్ని వదిలి స్నేహితులతో కలిసి చిప్స్ కంపెనీ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆయన తల్లి కూడా ఆశ్చర్యపోయారు.

జెన్సన్ హువాంగ్ తన ఆలోచనను తల్లికి చెప్పినప్పుడు, ఆమె 'నువ్వు వెళ్లి ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా?'' అని అన్నారట. దీన్నిబట్టి చూస్తే.. ఎన్విడియా ఇంత పెద్ద సంస్థగా మారుతుందని ప్రారంభంలో ఎవరూ ఊహించలేదని అర్థమవుతుంది.

ప్రారంభంలో గేమింగ్, కంప్యూటర్ చిప్స్
ప్రారంభంలో గేమింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం చిప్స్ తయారు చేసిన ఎన్వీడియా, కాలక్రమేణా తన టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసుకుంది. ముఖ్యంగా జీపీయూల సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. జీపీయూలు ఒకేసారి వేలాది చిన్న చిన్న లెక్కలను నిర్వహించగలవు. ఈ సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వాలన్నా, భారీ మొత్తంలో డేటాను విశ్లేషించాలన్నా అత్యంత వేగవంతమైన కంప్యూటింగ్ శక్తి అవసరం.

ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన ఎన్వీడియా.. ఏఐ కంప్యూటింగ్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఒకప్పుడు వీడియో గేమ్స్ కోసం తయారు చేసిన జీపీయూలే నేడు చాట్‌జీపీటీ వంటి ఆధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిలో కీలకంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరగడంతో ఎన్వీడియా చిప్స్‌కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఫలితంగా కంపెనీ ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.

ఇదీ చదవండి: జాబ్ మానేసినా జీతం ఇస్తాం.. CEO సంచలన నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement