2026–30లో అత్యంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ మనదే | India leads 10 major economies in macroeconomic resilience for 2026-30 | Sakshi
Sakshi News home page

2026–30లో అత్యంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ మనదే

Nov 13 2026 1:09 AM | Updated on Nov 13 2026 1:09 AM

India leads 10 major economies in macroeconomic resilience for 2026-30

అగ్రశ్రేణి పది ఆర్థిక వ్యవస్థల్లో 71 పాయింట్లతో అగ్రస్థానం 

రెండో స్థానంలో చైనా, చివరి స్థానంలో అమెరికా 

పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచంలోని పది అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో 2026–30 నాటికి అత్యంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుంది. మొత్తం 100 పాయింట్లకు గాను 71 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో నిలవగా, 66 పాయింట్లతో చైనా రెండో స్థానంలో నిలిచిందని పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ నివేదిక వెల్లడించింది. ‘ఇండియాస్‌ ఎకనామిక్‌ ఎడ్జ్‌ ఇన్‌ ది టాప్‌ టెన్‌ ఎకానమీస్‌’ పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. జపాన్, రష్యా చెరో 60 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (59), ఇటలీ, బ్రెజిల్‌ (చెరో 53), యూకే (52), ఫ్రాన్స్‌ (40) ఉండగా, అమెరికా (36) పదో స్థానంలో నిలిచింది. 

భారత్‌ అగ్రస్థానానికి దోహదపడిన అంశాలు: 
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ‘వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌’ గణాంకాల ఆధారంగా పది స్థూల ఆర్థిక సూచికలపై అసోచామ్‌ ఈ విశ్లేషణ జరిపింది. ఇందులో వాస్తవ జీడీపీ వృద్ధితో పాటు తలసరి జీడీపీ వృద్ధిలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. స్థూల జాతీయ పొదుపు, స్థూల మూలధన కల్పన విభాగాల్లో రెండో స్థానం; ఎగుమతుల వృద్ధి, జీడీపీలో రుణ నిష్పత్తిలో మూడో స్థానం దక్కించుకుంది. ఇక ప్రాథమిక ద్రవ్య నిల్వలో 5వ స్థానం, కరెంట్‌ ఖాతా నిల్వలు, నిర్మాణాత్మక ద్రవ్య నిల్వలో ఏడో స్థానం, మొత్తం ద్రవ్య లోటు నిర్వహణలో 8వ స్థానంలో నిలవడం భారత్‌ను అగ్రశ్రేణికి చేర్చింది. 

‘‘భారత ఆర్థిక పనితీరు విధానకర్తలు, వ్యాపార సంస్థలు, శ్రామిక శక్తి కృషికి నిదర్శనం. సంస్కరణలు కొనసాగించడం, ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించడం, తయారీ, ఎగుమతులను విస్తరించడంతో పాటు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునే శ్రామిక శక్తిని తీర్చిదిద్దడం భవిష్యత్‌ పురోగతికి కీలకం’’ అని అసోచామ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ ఎస్‌ పి శర్మ పేర్కొన్నారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ఫలాలు ఎంఎస్‌ఎంఈలతో పాటు క్షేత్ర స్థాయికి చేరాలని సూచించారు. మూలధనం, విద్యుత్, నిబంధనల అమలు, రవాణా (సరఫరా), కారి్మక వ్యయాలను తగ్గిస్తే దేశీయ పరిశ్రమలకు సమాన అవకాశాలు లభిస్తాయని, తద్వారా అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ అత్యంత పటిష్టంగా కొనసాగుతుందని శర్మ తెలిపారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement