2011–25 మధ్య 100 బిలియన్ డాలర్ల పొదుపు
2030 నాటికి 240 బిలియన్ డాలర్లకు చేరనున్న మొత్తం లబ్ధి
విదేశీ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ
ఐఈఏ ‘ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ రిపోర్ట్ 2026’ వెల్లడి
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి దేశానికి భారీగా విదేశీ కరెన్సీని ఆదా చేస్తోంది. 2011–2025 మధ్య బొగ్గు, సహజ వాయువు దిగుమతుల ఖర్చును తగ్గించుకోవడం ద్వారా భారత్‌కు ఏకంగా 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.9.4 లక్షల కోట్లు) పైగా ఆదా అయిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) స్పష్టం చేసింది.
2030 నాటికి ఈ మొత్తం పొదుపు దాదాపు 240 బిలియన్ డాలర్లకు (రూ.22.6 లక్షల కోట్లు) చేరనుందని ‘ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ రిపోర్ట్ 2026’ నివేదికలో అంచనా వేసింది. దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో విదేశీ శిలాజ ఇంధనాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గిందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణ లభించిందని తెలిపింది. నివేదికలో ముఖ్యాంశాలు....
→ బొగ్గు దిగుమతులకు భారీ కట్టడిపడింది. 2010 నుంచి భారత్ అదనంగా ఏర్పాటు చేసిన సౌర, పవన, బయో ఎనర్జీ సామర్థ్యం లేకపోయి ఉంటే.. 2025 ఒక్క ఏడాదిలో దేశ బొగ్గు దిగుమతులు మరో 110 మిలియన్ టన్నులు అధికంగా ఉండేవి.
→ 2030 నాటికి బొగ్గు, సహజ వాయువు దిగుమతులపై ఏటా సుమారు 35 బిలియన్ డాలర్ల (రూ.3.3 లక్షల కోట్ల) ఆదా సాధ్యం అవుతుంది.
→ గత దశాబ్దంలో భారత్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. 2026 నాటికి 300 గిగావాట్లు దాటడంతో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన మార్కెట్లలో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
→ 2026 సెప్టెంబరు 30 నాటికి భారీ జలవిద్యుత్తుతో కలిపి దేశ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 299.25 గిగావాట్లకు చేరింది. ఇందులో సోలార్ 171.05 గిగావాట్లు, పవన విద్యుత్ 59.2 గిగావాట్లుగా ఉన్నాయి. అణు విద్యుత్తును కలుపుకొని మొత్తం శిలాజేతర విద్యుత్ సామర్థ్యం 308 గిగావాట్లకు చేరింది.
→ వాతావరణ మార్పుల ఒప్పందాల ప్రకారం 2030 నాటికి మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50 శాతాన్ని శిలాజేతర ఇంధన వనరుల నుంచి సాధించాలనే లక్ష్యాన్ని భారత్ అయిదేళ్ల ముందే, అంటే 2025 నాటికే సాధించింది.
→ 2030 నాటికి అందుబాటులోకి వచ్చే కొత్త పునరుత్పాదక సామర్థ్యంలో సోలార్ పీవీ వాటా 80 శాతం కంటే ఎక్కువగా ఉండనుంది. సోలార్ సామర్థ్యం 350 గిగావాట్లు దాటనుండగా, మొత్తం పునరుత్పాదక సామర్థ్యం 530 గిగావాట్లకు చేరనుంది.
→ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ), దేశీయ కొనుగోలు నిబంధనల వంటి ప్రోత్సాహకాలతో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సోలార్ పీవీ మోడ్యూల్ తయారీ దేశంగా అవతరించింది. ముఖ్యంగా చైనా వంటి దేశాల నుంచి సోలార్ పరికరాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, గ్లోబల్ క్లీన్–ఎనర్జీ సప్లై చైన్‌లో భారత్ తన ప్రాధాన్యతను పెంచుకుంటోంది.
ఇళ్లకు, వ్యవసాయానికి సోలార్ విద్యుత్తు
ప్రభుత్వ పథకాలు పునరుత్పాదక శక్తిని కేవలం భారీ ప్రాజెక్టులకే పరిమితం చేయకుండా ఇళ్లకు, వ్యవసాయ రంగానికి విస్తరించాయి. ‘పీఎం సూర్య ఘర్’ పథకం ద్వారా గృహ వినియోగదారులు ఇళ్లపై రూఫ్‌టాప్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేస్తున్నారు. అలాగే పీఎం–కుసుమ్ ద్వారా రైతులకు సోలార్ పంప్‌సెట్ల సరఫరా, వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ద్వారా సంప్రదాయ విద్యుత్ వాడకాన్ని తగ్గించడంలో సహకరిస్తోంది.
మౌలిక సదుపాయాలు కీలకం
సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి నిరంతరంగా ఒకే స్థాయిలో ఉండదు కాబట్టి, విద్యుత్ సరఫరాలో స్థిరత్వం కోసం స్పష్టమైన అంచనాలు, గ్రిడ్ సరఫరా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ సామర్థ్యం తదితర మౌలిక సదుపాయాలు కీలకమని నివేదిక తెలిపింది. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) ఆర్థిక పరిస్థితి, భూసేకరణ సమస్యలు, అనుమతుల జాప్యం, ప్రాజెక్టుల అమలులోని ఆలస్యాన్ని నివారించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఈ సమస్యలను పరిష్కరిస్తే 2026–2030 మధ్య పునరుత్పాదక సామర్థ్య పెంపుదల అంచనాల కంటే 20 శాతానికి పైగా వేగవంతం అవుతుందని పేర్కొంది. ‘‘ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. భారత్ పునరుత్పాదక ఇంధన విస్తరణ దేశ ఇంధన భద్రతకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. స్థిరమైన ప్రభుత్వ విధానాలు ఇంధన ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో ఎలా దోహదపడతాయో చెప్పడానికి భారత అనుభవమే నిదర్శనం. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక ఆదర్శం.’’ ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు.


