షూటింగ్‌లో భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్
దోహా: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ నీరజ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. దీంతో పాటు ఈ విభాగంలో భారత్‌కు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్ బెర్త్ అందించాడు. తాజా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జయపాల్ మాల్వియా తొలి ఒలింపిక్ బెర్త్ దక్కించుకోగా... ఇప్పుడు నీరజ్ రెండోది సాధించాడు.
బుధవారం ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో నీరజ్ 346.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. దిమిత్రి పిమెనోవ్ (తటస్థ అథ్లెట్; 362.8 పాయింట్లు), ప్యాట్రిక్ జెనీ (స్లొవేకియా; 357.2 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గడంతో పాటు ఒలింపిక్ కోటాలు దక్కించుకున్నారు. భారత్‌కే చెందిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 323.7 పాయిట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ పురుషుల టీమ్ విభాగంలో నీరజ్ కుమార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, అఖిల్ షెరాన్‌తో కూడిన భారత జట్టు 1751 పాయింట్లతో కాంస్య పతకం గెలుచుకుంది. ఇందులో నీరజ్ 582 పాయింట్లు, ప్రతాప్ సింగ్ 587, అఖిల్ 582 పాయింట్లు సాధించారు. చెక్ రిపబ్లిక్ (1754 పాయింట్లు), నార్వే (1752 పాయింట్లు)స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నాయి.


