ఆరోగ్య మస్తు! | India is emerging as a global medical tourism hub Affordable treatment | Sakshi
Sakshi News home page

ఆరోగ్య మస్తు!

Nov 10 2026 4:48 AM | Updated on Nov 10 2026 4:48 AM

India is emerging as a global medical tourism hub Affordable treatment

మెడికల్‌ టూరిజానికి కేరాఫ్‌గా భారత్‌

టాప్‌ 46 దేశాల్లో పదో స్థానం 

తక్కువ ఖర్చులోనే నాణ్యమైన వైద్యం 

ప్రస్తుతం 8.7 బిలియన్‌ డాలర్ల పరిశ్రమ 

2030 నాటికి 16.2 బి. డాలర్లకు అప్‌

ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవల వ్యయాలు పెరిగిపోతున్నాయి. సంపన్న దేశాల్లో సైతం చికిత్స కోసం సుదీర్ఘ సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో పేషంట్లు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా మెడికల్‌ టూరిజంకి సంబంధించి భారత్‌ కీలక కేంద్రంగా ఎదుగుతోంది. సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడం, సంపన్న దేశాలతో పోలిస్తే నాణ్యమైన చికిత్స తక్కువ ఖర్చుకే లభిస్తుండటంలాంటివి భారత్‌కి సానుకూలాంశాలుగా నిలుస్తున్నాయి. 

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) విడుదల చేసిన వివరాల ప్రకారం 2022లో మెడికల్‌ వేల్యూ ట్రావెల్‌ (ఎంవీటీ) పరిశ్రమ 115.6 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2030 నాటికి ఏటా 10.8 శాతం వృద్ధితో దాదాపు 286.1 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. ఇక దేశీయంగా చూస్తే 2025లో 8.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్న మెడికల్‌ టూరిజం పరిశ్రమ 2030 నాటికి దాదాపు రెట్టింపై 16.2 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. 

దీనితో కేంద్రం కూడా మెడికల్‌ టూరిజానికి దన్నుగా నిల్చేలా పలు చర్యలు తీసుకుంటోంది. ఇటు అలోపతి వైద్య చికిత్సలతో పాటు అటు ఆయుర్వేదం, హోమియోపతిలాంటి సాంప్రదాయ విధానాలకు కూడా ఊతమిస్తోంది. అలాగే, చికిత్స కోసం వచ్చే విదేశీయులకు అడ్డంకులు ఏర్పడకుండా వీసా ప్రక్రియలను కూడా సరళతరం చేస్తోంది.  

టాప్‌ 10లో భారత్‌.. 
వైద్య చికిత్సలకు సంబంధించి ప్రధానంగా మెడికల్‌ టూరిజం, వెల్‌నెస్‌ టూరిజం అని రెండు విభాగాలు ఉంటున్నాయి. మెడికల్‌ టూరిజంలో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు, అవయవ మారి్పడులు, అధునాతన వైద్యపరీక్షలు మొదలైనవి ఉంటాయి. ఇక, ప్రివెంటివ్‌ కేర్‌కి సంబంధించిన వెల్‌నెస్‌ టూరిజం పరిధిలోకి యోగా, ఆయుర్వేద, నేచురోపతి, ఆయుష్‌ తదితర విధానాలు వస్తాయి. మెడికల్‌ టూరిజం ఇండెక్స్‌ 2020–21 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 46 మెడికల్‌ టూరిజం దేశాల్లో భారత్‌ 10వ స్థానంలో ఉంది. 

టాప్‌ 20 వెల్‌నెస్‌ టూరిజం మార్కెట్లలో 12వ స్థానంలో, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని టాప్‌ 10 వెల్‌నెస్‌ దేశాల్లో 5వ స్థానంలో ఉంది. 2025లో మొత్తం 91.5 లక్షల మంది విదేశీ టూరిస్టులు భారత్‌ను సందర్శించగా అందులో దాదాపు 5.5 శాతం మంది .. అంటే  5,07,244 మంది ప్రత్యేకంగా వైద్య చికిత్సల కోసమే వచ్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీలో ట్రావెల్, టూరిజం రంగం వాటా 5.22 శాతంగా నమోదైంది. దాదాపు 8.46 కోట్ల ఉద్యోగాలను పరోక్షంగా, ప్రత్యక్షంగా కల్పిస్తూ మొత్తం ఉద్యోగాల కల్పనలో 13.3 శాతం వాటా కలిగి ఉంది.  

అత్యుత్తమ ప్రమాణాలు .. 
మెడికల్‌ టూరిజం విషయంలో భారత్‌ ఆకర్షణీయంగా మారడానికి ప్రధానంగా మరికొన్ని కారణాలు కూడా దోహదపడుతున్నాయి. దేశీయంగా విస్తృత స్థాయిలో 69,364 ఆస్పత్రులు (ప్రైవేట్‌వి 43,486, ప్రభుత్వ ఆస్పత్రులు 25,778) ఉన్నాయి. డాక్టర్లు, పేషంట్ల నిష్పత్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా  12 లక్షల మంది రిజిస్టర్డ్‌ డాక్టర్లున్నారు. వైద్య విద్య బోధన ప్రధానంగా ఇంగ్లిష్‌లో ఉండటం సైతం కలిసి వచ్చే అంశంగా ఉంటోంది. అంతర్జాతీయ పేషంట్లకు సేవలందించడంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.

 నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎన్‌ఏబీహెచ్‌ (నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌) నిర్దేశించిన 600కు పైగా భద్రతా ప్రమాణాలను పాటిస్తున్న ఆసుపత్రుల సంఖ్య 1,299గా ఉంది. పలు భారతీయ ఆస్పత్రులకు అంతర్జాతీయ స్థాయి జాయింట్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) అక్రెడిటేషన్‌ కూడా ఉంది. 2022 గణాంకాల ప్రకారం ఢిల్లీలో అత్యధికంగా 9 జేసీఐ అక్రెడిటెడ్‌ హాస్పిటల్స్‌ ఉన్నాయి. ముంబై(6), బెంగళూరు(3), చెన్నై, హైదరాబాద్‌ (చెరి రెండు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  

ఆకర్షణీయంగా ఆయుష్‌ .. 
ఆయుర్వేదం, యోగ, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి .. వెరసి ‘ఆయు‹Ù’ విభాగం కింద వెల్‌నెస్‌ చికిత్సలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఈ విభాగానికి మెడికల్‌ వెల్‌నెస్‌ టూరిజం సేవలకు అంతర్జాతీయ ప్రమాణమైన ఐఎస్‌వో 22525 సరి్టఫికేషన్‌ ఉండటం సానుకూలాంశం. ప్రస్తుతం 27 పైచిలుకు బీమా కంపెనీలు ఆయుష్‌ చికిత్సలు కూడా భాగంగా ఉండే 140 పైగా పాలసీలను అందిస్తున్నాయి.  2026–27 బడ్జెట్‌లో  దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ మెడికల్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ రంగంతో కలిసి అభివృద్ధి చేయనున్నారు. ఈ సమగ్ర హెల్త్‌కేర్‌ కాంప్లెక్స్‌లలో వైద్యం, విద్య, పరిశోధన సదుపాయాలతో ప్రత్యేకమైన ఆయుష్‌ సెంటర్లు ఉంటాయి.

విదేశీయులకు కవరేజీతో టూరిజంకు దన్ను.. 
భారత్‌కి వచ్చే విదేశీ పేషంట్ల చికిత్స వ్యయాలకు కూడా బీమా కంపెనీలు కవరేజీని అందించడం ప్రారంభిస్తే మెడికల్‌ టూరిజం మరింతగా పుంజుకుంటుందని అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో భారత్‌కి వస్తున్న నేపథ్యంలో ఇది అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ఈ విషయంలో బీమా కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సారథ్యం వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ప్రజారోగ్య సంరక్షణలో తమ వంతుగా అమెరికాకు చెందిన గారి్మన్‌ హెల్త్‌తో కలిసి ’గ్రామీణ్‌ బై గారి్మన్‌’ స్కీము కింద ఆంధ్రప్రదేశ్‌లోని అరగొండ గ్రామంలో 100 మందికి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించే వాచీలను అందించినట్లు సంగీతా రెడ్డి తెలిపారు.

డిమాండ్‌లో ఉన్న చికిత్సలు
→ గుండె ఆపరేషన్లు 
→ ఆర్థోపెడిక్‌ ప్రొసీజర్లు 
→ క్యాన్సర్‌ చికిత్సలు 
→ అవయవ మారి్పడులు 
→ న్యూరోలాజికల్‌ చికిత్సలు 
→ కాస్మెటిక్‌ శస్త్రచికిత్సలు 
→ దంత సంరక్షణ 
→ ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌ 
→ ఆయుష్‌ ఆధారిత వెల్‌నెస్‌ థెరపీలు

వీసాలపరంగా వెసులుబాటు..
విదేశీ పేషంట్లు, వారి అటెండెంట్లకు అనువుగా ఉండేలా సుమారు 172 దేశాల వారికి ఈ–మెడికల్‌ వీసా, ఈ–మెడికల్‌ అటెండెంట్‌ వీసా సదుపాయాన్ని భారత్‌ కలి్పస్తోంది. ఈ–ఆయుష్‌ వీసా, ఈ–ఆయుష్‌ అటెండెంట్‌ వీసా కేటగిరీలను కూడా ప్రవేశపెట్టింది. అలాగే చికిత్సలను బుక్‌ చేసుకోవడం నుంచి చికిత్స అనంతర సంరక్షణ వరకు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా మెడికల్‌ వేల్యూ ట్రావెల్‌ పోర్టల్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తోంది. 

అంతర్జాతీయ పేషంట్లకు ఇమిగ్రేషన్, కస్టమ్స్, బ్యాగేజ్‌ క్లెయిమ్‌ల వంటి వాటిల్లో సహాయం అందించడం ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో లాంజీల సదుపాయం మొదలైనవి కూడా అందుబాటులో ఉండేలా చూడటంపైనా కసరత్తు చేస్తోంది. ఇవన్నీ పర్యవేక్షించడానికి 2015లో కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా నేషనల్‌ మెడికల్‌ అండ్‌ వెల్‌నెస్‌ టూరిజం ప్రమోషన్‌ బోర్డు (ఎన్‌ఎండబ్ల్యూటీబీ)ని ఏర్పాటు చేసింది. కేంద్ర టూరిజం శాఖ మంత్రి సారథ్యంలో ఉండే ఈ బోర్డు.. వివిధ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆస్పత్రులు,  పరిశ్రమవర్గాలతో కలిసి పని చేస్తుంది. రాష్ట్రాలు కూడా సొంతంగా మెడికల్, వెల్‌నెస్‌ టూరిజం ప్రమోషన్‌ బోర్డులను ఏర్పాటు చేసేలా కేంద్రం ప్రోత్సహిస్తోంది.  

ఎక్కువగా ఎక్కడి నుంచంటే..
దేశం    మెడికల్‌ టూరిస్టులు (సంఖ్య)
బంగ్లాదేశ్‌             3,25,127 
ఇరాక్‌                    30,989 
ఉజ్బెకిస్తాన్‌             13,699 
సోమాలియా            11,506 
తుర్క్‌మెనిస్తాన్‌        10,231 
ఒమన్‌                     9,738 
కెన్యా                       9,357 
 (2025 డేటా) 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement