ముందు జాగ్రత్తేమందు! | Important topics for diabetes awareness | Sakshi
Sakshi News home page

ముందు జాగ్రత్తేమందు!

Nov 10 2026 4:21 AM | Updated on Nov 10 2026 4:21 AM

Important topics for diabetes awareness

డయాబెటిస్‌కథనం–1

సాధారణంగా ఏ వ్యాధి అయినా ఎవరికీ నచ్చదు కానీ... ఇక డయాబెటిస్‌ విషయానికి వస్తే ఇదంటే మరీ ఎవరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది ఇష్టమైన స్వీట్స్‌ లాంటివి తిననివ్వదు. కష్టమైనవి చేయాలంటుంది. ఉదాహరణకు వ్యాయామం లాంటివి చేస్తూ క్రమశిక్షణతో ఉండాలంటుంది. ఇప్పుడు  కనీసం ఇంటికి ఇద్దరో ఒక్కరో
బాధితులు ఉండే ఈ వ్యాధి గురించి దాదాపు అందరికీ తెలిసినవే అయినప్పటికీ... రోజూ సరికొత్త పేషెంట్లు ఈ వ్యాధి జాబితాకు చేరుతుండటంతో పాటు...  ఈ నెల 14న వరల్డ్‌ డయాబెటిస్‌ డే నేపథ్యంతో  అందరూ డయాబెటిస్‌పై అవగాహన పెంచుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో నేటి నుంచి వరుస కథనాలు...


డయాబెటిస్‌ అనే ఈ ఆరోగ్య సమస్య కాలక్రమంలో గుండెజబ్బులూ, కిడ్నీసమస్య లు, పక్షవాతంలాంటి జబ్బులెన్నింటినో వెంటబెట్టుకొస్తుంది.   తల మొదలుకొని కాళ్ల వేళ్ల వరకు దేహంలోని ప్రతి అవయవాన్నీ  ప్రభావితం చేస్తుంది.  ఈ ఏడాది థీమ్‌ ‘అర్లీ యాక్షన్‌ ఆన్‌ డయాబెటిస్‌’ దీన్ని అదుపులో పెట్టడానికి ఎంత త్వరగా పూనుకుంటే అంతమంచిదనే సందేశాన్నిస్తుంది. 

ఎన్నో రకాలు...  
సాధారణంగా డయాబెటిస్‌లో టైప్‌–1, టైప్‌–2 అనే ప్రధాన రకాలు అందరికీ తెలిసినవి. వీటితో పాటు గర్భవతుల్లో కనిపించే జస్టేషనల్‌ డయాబెటిస్‌ గురించీ కొందరికి తెలుస్తుంది. ఇవేగాక... లాడా (లేటెంట్‌ ఆటోఇమ్యూన్‌ డయాబెటిస్‌ ఇన్‌ అడల్ట్స్‌), మోడీ (మెచ్యురిటీ ఆన్‌సెట్‌ ఆఫ్‌ ద యంగ్‌) అనే రకాలూ ఉంటాయి. అయితే  ఒక వయసు తర్వాత ఇన్సులిన్‌కు మన శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో స్పందించడం మానేయడం వల్ల కనిపించే టైప్‌–2 డయాబెటిస్‌  సాధారణం. ఇదీ 90% మందిలో కనిపిస్తుంది. కాబట్టి దీని గురించిన అవగాహన అవసరం. 

చికిత్స... 
→ టైప్‌–1 డయాబెటిస్‌కు వైద్యుల సూచనపై ఇన్సులిన్‌ ఇవ్వడం మాత్రమే ఏకైక మార్గం. 
→ ఎక్కువ మందిలో కనిపించే టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇన్సులిన్‌ను స్రవింపజేసే క్లోమగ్రంథిని చురుగ్గా చేసేందుకు మందులు ఇస్తుంటారు. అవి కూడా పనిచేయని సమయాల్లో డాక్టర్లు అవసరమైన మోతాదులో ఇన్సులిన్‌ సిఫార్సు చేస్తుంటారు. ఇలా ఇన్సులిన్‌ తీసుకోవాల్సి రావడం చాలా అడ్వాన్స్‌డ్‌ దశగా చెప్పుకోవచ్చు. ఇలాంటి దశకు చేరడం కంటే ఆహారం, వ్యాయామం వంటి కొద్దిపాటి జీవనశైలి జాగ్రత్తలతో డయాబెటిస రాకుండానే నివారించడం చాలా మేలు చేసే అంశం. 

నివారణ చర్యలివి... 
జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం. అంటే... ∙తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్‌తో పాటు తక్కువ కొవ్వులూ, మంచి ప్రోటీన్‌తో కూడిన సమతులాహారం. వీలైతే లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహారాల్లో బ్రౌన్‌రైస్, క్వినోవా రైస్, దంపుడుబియ్యం వంటివి తీసుకోవడం. తక్కువ మోతాదులో  రైస్, ఆకుకూరలూ, కాయగూరలు అధిక మోతాదులో తీసుకోవడం ∙డయాబెటిక్స్‌ తో పాటు... దాన్ని నివారించుకోవాలనుకునేవారు  జామ, గ్రీన్‌ ఆపిల్, ఓ మోస్తరుగా పండిన పుచ్చకాయలు, దోరగా పండిన బొప్పాయి, దానిమ్మ, కివి, ఆరెంజెస్, నేరేడుపండ్లు 

→ వారానికి రెండున్నర గంటల వ్యవధి తగ్గకుండా లేదా డాక్టర్‌ సలహా మేరకు వ్యాయామం చేయడం → కూల్‌డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండటం, పొగతాగడం, మద్యపానం పూర్తిగా మానేయడం వంటి చర్యలతో చక్కెరల స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు 
→ బరువు పెరగకుండా / ఒబేసిటీ లేకుండా నియంత్రించుకోవడం 
→ డయాబెటిస్‌ వచ్చే ముందు స్థితిని ప్రీ– డయాబెటిస్‌ అంటారు. దీంట్లో మందులు ఇవ్వని స్థితి. ఈ స్థితిలో లైఫ్‌స్టైల్‌ నియమాలు పాటిస్తూ చాలాకాలం పాటు డయాబెటిస్‌ రాకుండా నివారించవచ్చు. 

ఇక్కడ పేర్కొన్న సూచనలను డయాబెటిక్, ప్రీ–డయాబెటిక్‌ కండిషన్‌ ఉన్నవారితో పాటు అసలు డయాబెటిస్‌ రానివారు/లేనివారు కూడా పాటిస్తే... డయాబెటిస్‌ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుంది.
నిర్వహణ: యాసీన్‌

లక్షణాలు...  ∙డయాబెటిస్‌ ఉన్నవారిలో  ఆకలి పెరగడం ∙విపరీతంగా దాహం వేయడం ∙తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం ∙గాయాలు ఒక పట్టాన వెంటనే తగ్గకపోవడం. (ఒంట్లోని రక్తప్రవాహంలో చక్కెర ఉంటడంతో బ్యాక్టీరియా ఒకపట్టాన వదలదు. వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ తగ్గడం వల్ల గాయాలు త్వరగా మానవు).  

వైద్య పరీక్షలు... 
చక్కెర వ్యాధిని గుర్తించడానికి...
→ ఫాస్టింగ్‌ షుగర్‌ టెస్ట్‌ : కనీసం ఎనిమిది గంటల సేపు ఏమీ తినకుండా చేసే పరీక్ష.  
→ పోస్ట్‌ ఫుడ్‌ షుగర్‌ టెస్ట్‌: ఆహారం తీసుకున్న గంటన్నర తర్వాత చేసే పరీక్ష.   
→ ర్యాండమ్‌ షుగర్‌ టెస్ట్‌ : తిన్నా, తినకున్నా ఏదో ఒక సమయంలో చేసే పరీక్ష 
→ డయాబెటిస్‌ను తెలుసుకోవడం కోసం హెచ్‌బీఏ1సీ అనే పరీక్షను కూడా చేస్తారు. 
→ ఓరల్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (ఓజీటీటీ)  ప్రతి అరగంటకోమారు గ్లూకోజ్‌ ఇస్తూ రక్తంలోని చక్కెర మోతాదులను పరీక్షిస్తూ చేసూ పరీక్ష ఇది. బార్డర్‌లైన్‌లో ఉన్నవారికి ఈ పరీక్ష చేస్తారు.

డాక్టర్‌ శివరాజు
సీనియర్‌ ఫిజీషియన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement