విజయవాడ: అవినీతి నిర్మూలన, పారదర్శకత, నిజాయితీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడలో వాక్‌థాన్ నిర్వహించారు.
పీఎన్‌బీ విజయవాడ సర్కిల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్‌థాన్‌లో బ్యాంకు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. బందర్ రోడ్డులో సాగిన ఈ వాక్‌థాన్ ద్వారా అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు నిజాయితీ, నైతిక విలువలు, పారదర్శకత ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది ఇంటెగ్రిటీ ప్లెడ్జ్ స్వీకరించారు. విధి నిర్వహణలో నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని, అవినీతికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా బ్యాంకు శాఖల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో అవినీతి నిరోధక విలువలను పెంపొందించేందుకు క్విజ్, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభల ద్వారా ప్రజలకు అవినీతి నిరోధక చర్యలు, పారదర్శకత, నైతిక విలువలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎన్‌బీ సీనియర్ అధికారులు, వివిధ శాఖల బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.


