'నేను చనిపోతానేమోనని భయపడ్డా'.. కానీ అసలు సమస్య ఇదే! | Health Anxiety Signs Symptoms And Management | Sakshi
Sakshi News home page

'నేను చనిపోతానేమోనని భయపడ్డా'.. కానీ అసలు సమస్య ఇదే!

Oct 23 2026 8:10 AM | Updated on Oct 23 2026 8:13 AM

Health Anxiety Signs Symptoms And Management

ఆరోగ్యం బాగానే ఉన్నా.. ఏదో వ్యాధి ఉందేమోనని భయపడుతున్నారా? చిన్నపాటి నొప్పి వచ్చినా ప్రాణాలకే ప్రమాదమేమోనని ఆందోళన చెందుతున్నారా? ఇంటర్నెట్‌లో ఇలాంటి లక్షణాలకై వెతుకుతూ మరింత భయపడుతున్నారా? అయితే మీరు హెల్త్‌ యాంగ్జైటీతో బాధపడుతున్నారేమో! బ్రిటన్‌కు చెందిన హోలీ షర్మన్‌ 25 సంవత్సారాల మహిళ. తనకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అదేంటో చూద్దాం!

చిన్నప్పటి నుంచే తన ఆరోగ్యం గురించి అతిగా ఆందోళన చెందే హోలీ.. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో వారానికి నాలుగైదు సార్లు ఆస్పత్రికి వెళ్లేది. వైద్యులు ఎన్నిసార్లు పరీక్షలు చేసినా ఎలాంటి సమస్య కనిపించేది కాదు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కాళ్లు బలహీనంగా అనిపించినా, మరో చిన్న లక్షణం కనిపించినా వెంటనే ఇంటర్నెట్‌లో వెతికేది. దీంతో గుండె జబ్బు వంటి తీవ్రమైన వ్యాధులున్నాయేమోనని భయపడి మళ్లీ ఆస్పత్రికి పరుగులు తీసేది. ఇలా ఆమె భయం ఓ మరో పెద్ద మానసిక వ్యాధిగా మారిపోయింది.

క్రమంగా ఈ ఆందోళన 'నా వ్యక్తిగత జీవితాన్నే ప్రభావితం చేసింది. నా కుటుంబ సభ్యులతో మాట్లాడటం తగ్గించేశాను. నా భర్త ఎంతగా ధైర్యం చెప్పినా తన మనసులోని భయం మాత్రం తగ్గేది కాదు. చివరికి నాకు హెల్త్‌ యాంగ్జైటీతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే నా కుటుంబ సభ్యులు, భర్త అందించిన సహకారంతో నేను క్రమంగా కోలుకున్నాను. గతంలో కనిపించిన లక్షణాలను రాసుకుని, అప్పుడు కూడా నేను బాగానే ఉన్న విషయాన్ని గుర్తుచేసుకోవడంతో ఈ ఆందోళనను నియంత్రించుకోవడం నేర్చుకున్నానని' వివరించింది.

హెల్త్‌ యాంగ్జైటీ లక్షణాలివే!
ఆరోగ్యంపై నిరంతరం ఆందోళన చెందడం, శరీరాన్ని పదేపదే పరిశీలించుకోవడం, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రతలను తరచూ కొలవడం, ఇంటర్నెట్‌లో వ్యాధుల లక్షణాల కోసం వెతకడం వంటివి ఈ సమస్యకు సంకేతాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే తమకు ఏమీ కాలేదని కుటుంబ సభ్యులు, స్నేహితులు పదేపదే భరోసా ఇవ్వాలని కోరుకుంటారు. మరికొందరు తీవ్రమైన వ్యాధి బయటపడుతుందనే భయంతో వైద్యులను సంప్రదించడానికి కూడా వెనుకాడుతుంటారు. ఈ ఆందోళన ఎక్కువైతే రోజువారీ పనులు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని, అలాగే, ఈ మానసిక వ్యాధికి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆందోళనను అధిగమించేదెలా?
శరీరంలో కనిపించే ప్రతి చిన్న మార్పునూ తీవ్రమైన వ్యాధిగా భావించకూడదు. ఇంటర్నెట్‌లో పదేపదే లక్షణాల కోసం వెతకడం, ఇతరులను భరోసా కోసం అడగడం తగ్గించాలి. అలాగే నడక, తేలికపాటి వ్యాయామం, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, చుట్టూ ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం వంటి పద్ధతులు ఆందోళనను నియంత్రించడంలో తోడ్పడవచ్చు. కొత్తగా కనిపించిన లక్షణాలు తగ్గకుండా కొనసాగితే, ముఖ్యంగా తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుల సూచలనలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంపై శ్రద్ధ ఉండటం మంచిదే.. కానీ అదే శ్రద్ధ అతిగా మారి నిరంతర భయానికి కారణమైతే మాత్రం జాగ్రత్త పడాలి. భయంతో జీవితాన్ని ఆపేసుకోవద్దు.. అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకుంటూ, ఆందోళనను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. హోలీ అనుభవం చెప్పేది కూడా ఇదే.. మనసులోని భయాన్ని గుర్తించి, సరైన సహాయం తీసుకుంటే మళ్లీ సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చునని వైద్యుల సలహా.

ఇదీ చదవండి: కేరళ గ్రామం నుంచి లాస్ ఏంజిల్స్‌ వరకు..! ఎవరీ రవ్లీన్ వర్గీస్?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement