ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి..అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై మెరిసే రేంజ్‌కు చేరుకుని యువతకు స్ఫూర్తిగా నిలిచిందామె. ఒక చిన్న అవకాశం ఆమె తలరాతనే మార్చే గొప్ప కెరీర్ విజయంగా మారింది.
ఆ అమ్మాయే కేరళలోని పథనంతిట్ట జిల్లా కోడుమోన్‌కు చెందిన రవ్లీన్ వర్గీస్. ఫ్యాషన్‌డిజైన్ కోర్సు చదవడానికి 18 ఏళ్ల వయసులో ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఒక టాలెంట్ స్కౌట్ ఆమెను గమనించి మోడలింగ్‌లో చిన్న అవకాశం ఇచ్చింది. అది కాస్తా ఆమెను అంతర్జాతీయ ప్రాజెక్టులలో పనిచేస్తూ..కెరీర్‌ను నిర్మించుకునే రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇందులో భాగంగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్'లో డిజైనర్ ప్రబల్ గురుంగ్ నిర్వహించిన 'స్ప్రింగ్/సమ్మర్ 2025' ప్రదర్శనలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.
అక్కడ నుంచి 'విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షో'లో అరంగేట్రం చేసేందుకు దారితీసింది. ఇది అంతర్జాతీయ మోడలింగ్ కెరీర్‌లో ఒక కీలమై మైలురాయి. అలాగే 'విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షో' పాల్గొన్న తొలి కేరళ బ్యూటీగా ఘనత దక్కించుకుంది కూడా. అంతేగాదు ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వేదికలలో ఒకటైన 'విక్టోరియాస్ సీక్రెట్' ర్యాంప్‌పై ఈ మలయాళీ ప్రతిభను చాటి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమె ఈ షోలో, రెండు విభిన్నమైన లుక్‌లలో కనిపించి అలరించింది. ఒక లుక్‌లో మోడల్‌గా తన బహుముఖ ప్రజ్ఞను చాటగా, మరొక లుక్‌లో బెల్లా హదీద్, గిగీ హదీద్ వంటి అంతర్జాతీయంగా పేరుగాంచిన మోడళ్లతో కలిసి వేదికను పంచుకుంటూ మెరిసింది. అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ, తన మూలాలను మర్చిపోలేదామె. ఇప్పటికీ తాను మలయాళ సంగీతాన్నే వింటానని పేర్కొంది రవ్లీన్ వర్గీస్.
ఇదీ చదవండి: నేవీ బ్లూ బనారసి చీరలో చందమామలా సాయిపల్లవి!)


