దేశ భవిష్యత్తు ముప్పులపై ఆర్‌బీఐ సమీక్ష | RBI Central Board Meets Sanjay Malhotra Reviews Economy Inflation Risks | Sakshi
Sakshi News home page

దేశ భవిష్యత్తు ముప్పులపై ఆర్‌బీఐ సమీక్ష

Oct 31 2026 9:00 AM | Updated on Oct 31 2026 9:00 AM

RBI Central Board Meets Sanjay Malhotra Reviews Economy Inflation Risks

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, వృద్ధికి ఎదురుకాగల సవాళ్లు, భవిష్యత్తు అంచనాలపై కలిగే ముప్పులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర బోర్డు చర్చించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ముంబైలో జరిగిన ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్ల 625వ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఆర్థిక ముప్పులు.. అంతర్జాతీయ సవాళ్లు

ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ సరళి, దేశీయ మార్కెట్లలో డిమాండ్ పరిస్థితులు వంటి పలు కీలక అంశాలను బోర్డు సమావేశం విశ్లేషించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విధానాల్లో మారుతున్న సంక్లిష్టతలు భారత ఆర్థిక వృద్ధిపై చూపగల ప్రభావం గురించి బోర్డు పెద్దలు చర్చించారు. దేశీయంగా తయారీ, సేవా రంగాల నుంచి అందుతున్న బలమైన మద్దతును గుర్తిస్తూనే ఆర్థిక వ్యవస్థను అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరాన్ని ఇందులో హైలైట్‌ చేశారు.

కీలక ప్రముఖుల హాజరు

ఈ అత్యున్నత సమావేశంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్.జె, పూనమ్ గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము, రోహిత్ జైన్ పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అనురాధ ఠాకూర్, బోర్డు డైరెక్టర్లు ఆనంద్ గోపాల్ మహీంద్రా, జన్మేజయ కుమార్ సిన్హా, సయ్యద్ అక్బరుద్దీన్, అన్నీ జార్జ్ మాథ్యూ తదితరులు ఈ సమావేశానికి హాజరై ఆర్థికాంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

డిపాజిట్ ఇన్సూరెన్స్ సమీక్ష

ఆర్థిక వ్యవస్థపై సమగ్ర పర్యవేక్షణతో పాటు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కార్యకలాపాలను, వివిధ కేంద్ర కార్యాలయ విభాగాల పనితీరును కూడా బోర్డు ఈ సందర్భంగా సమీక్షించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను, వ్యవస్థాగత అంశాలను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన నియంత్రణ ప్రాధాన్యతలపై చర్చించారు.

ఇదీ చదవండి: రూ.8,300 డౌన్‌! అమాంతం పడిన పసిడి, వెండి ధరలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement