బంగారంపై పెట్టిన డబ్బులు ఊరికే పోవు. మంచి లాభాలిస్తాయన్నది చాలా మంది గృహిణుల నమ్మకం. అది వట్టి మాట కాదు.. వాస్తవం అని చాటుతున్నాయి ఆర్బీఐ తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB). పెట్టిన పెట్టుబడికి మూడింతలు పైగా లాభాన్ని ఇస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 2018-19 సిరీస్-2 సావరిన్ గోల్డ్ బాండ్లకు (ఇష్యూ తేదీ అక్టోబర్ 23, 2018) తుది రిడంప్షన్ ధరను ప్రకటించింది. ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. గోల్డ్ బాండ్ పెట్టుబడిదారులు ఈ అక్టోబర్ 23న ముందస్తుగా రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సాధారణంగా సావరిన్ గోల్డ్ బాండ్ల కాల పరిమితి ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది. అయితే గోల్డ్ బాండ్లను జారీ చేసిన తేదీ నుంచి సరిగ్గా ఐదేళ్లు పూర్తయిన తర్వాత వాటిని ముందుస్తుగా రిడీమ్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పిస్తుంది. ఇందుకు తాజా బంగారం రేటును లెక్కగట్టి రిడంప్షన్ ధరను ప్రకటిస్తుంది.
రిడంప్షన్ ధరను ఎలా నిర్ణయిస్తారంటే..
సావరిన్ గోల్డ్ బాండ్లకు రిడంప్షన్ ధరను నిర్ణయించడానికి ఆర్బీఐ ప్రత్యేక ప్రక్రియను అనుసరిస్తుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) మునుపటి మూడు పని దినాలలో ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా గోల్డ్ బాండ్ సిరీస్ రిడంప్షన్ ధరను లెక్కించినట్లు ఆర్బీఐ ప్రకటన తెలిపింది.
2018-19 సిరీస్-II తుది రిడంప్షన్ ధర ఇదే..
అక్టోబర్ 23న చెల్లించాల్సిన తుది రిడంప్షన్ ధర గత మూడు రోజులు (మార్కెట్ పని దినాలు) అంటే అక్టోబర్ 19, అక్టోబర్ 21 అక్టోబర్ 22 తేదీలలో బంగారం ముగింపు ధర సాధారణ సగటు ఆధారంగా ఒక్కో బాండ్ యూనిట్‌కు రూ .14,425గా ఆర్బీఐ నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం ఎస్‌జీబీ 2018-19 సిరీస్-2 ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం గ్రాముకు రూ.3,096 చొప్పున జారీ చేయగా ఇప్పుడిది తుది రిడంప్షన్ తేదీ నాటికి రూ .11,329 అంటే సుమారు 366% రాబడిని ఇస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే అప్పుడు రూ .1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడది సుమారు రూ .4.66 లక్షలకు పెరిగిందన్న మాట.
వడ్డీ ఆదాయం అదనం
సావరిన్ గోల్డ్ బాండ్లపై తుది రిడంప్షన్ ధర ద్వారా వచ్చే లాభం కాకుండా అదనంగా వడ్డీ ఆదాయం కూడా ఉంటుంది. గోల్డ్ బాండ్లు జారీ చేసినప్పటి నుంచి పెట్టుబడి మొత్తంపై ఆర్బీఐ కొంత వడ్డీ చెల్లిస్తుంది. ఇది సంవత్సరానికి 2.50 శాతం (స్థిర రేటు) ఉంటుంది. అయితే 2015-16 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన గోల్డ్ బాండ్లు 2.75 శాతం వడ్డీ రేటును అందించాయి.


