మళ్లీ రూ.1000 నోటు వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పసుపు రంగులో ఉన్న ఓ నోటు ఫొటోలను షేర్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త వెయ్యి రూపాయల నోటును తీసుకురాబోతోందని కొందరు చెబుతున్నారు. ఇంకొందరు మాత్రమే నోటు విడుదలకు సంబంధించిన తేదీని కూడా చెప్పేస్తున్నారు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.
కొత్త రూ.1,000 నోటు విడుదలైందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త వెయ్యి రూపాయల నోటు జారీపై ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ క్లారిటీ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. కరెన్సీ నోట్లకు సంబంధించిన ఏదైనా కొత్త సమాచారం వచ్చినప్పుడు, అధికారిక ప్రకటనలను పరిశీలించిన తర్వాతే నమ్మాలని పేర్కొంది.
ప్రస్తుతం మన దేశంలో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయి. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన సమయంలో.. పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది. నల్లధనం, నకిలీ కరెన్సీ, అవినీతిని అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కొత్త డిజైన్‌తో రూ.500 నోటును తీసుకొచ్చింది. కానీ, పాత వెయ్యి రూపాయల నోటును మాత్రం తిరిగి చలామణిలోకి తీసుకురాలేదు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ కొత్తగా రూ.2,000 నోటును ప్రవేశపెట్టింది. అయితే, 2023 మేలో ఆ నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి రూ.1,000 నోటును మళ్లీ తీసుకొస్తారనే వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రచారమే మొదలైంది. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న కొత్త రూ.1,000 నోటుకు సంబంధించి ఆర్‌బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
🚨 FAKE ₹1,000 NOTE ALERT! Several social media posts claim that a new ₹1,000 note has been issued. #PIBFactCheck ❌ This claim is fake. ✅ The @RBI has made no announcement regarding the issuance of a new ₹1,000 note. 🔸 Verify information through official sources and do not share unverified claims. 💡 Come across suspicious content related to the Central Government? Report it to @PIBFactCheck. 📲 +91 8799711259 📩 factcheck@pib.gov.in
— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2026


