ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
ఇరాన్ యుద్ధం, పెరిగిన ముడి చమురు ధరలే రూపాయి బలహీనతకు పూర్తిగా కారణమని భావించడం, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోగానే రూపాయి తిరిగి పుంజుకుంటుందని ఆశించడం సమస్యను తప్పుగా అర్ధం చేసుకోవడమే అవుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టంచేశారు. పెరుగుతున్న చమురు ధరలు ఆందోళకరమే అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా రూపాయి అనేక విధాలుగా ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. దీనికి నిరంతర మూలధన పెట్టుబడుల తరలింపు కారణమని, దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులు రెండూ రూపాయిపై ప్రభావం చూపుతున్నాయని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో సుబ్బారావు పేర్కొన్నారు.
ఖరీదైన మార్కెట్‌గా భారత్
భారతీయులు కొంతకాలంగా భారీ స్థాయిలో స్టాక్స్, ముచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయడం మార్కెట్‌కు మద్దతిస్తోందని, అయితే ఈ పెట్టుబడుల కారణంగా షేర్ల విలువలు కూడా అధిక స్థాయిలకు చేరుకున్నాయన్నారు. వివిధ మార్కెట్లలో లభించే రాబడులను పోల్చి చూసే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు ప్రస్తుత విలువల వద్ద భారత ఈక్విటీల్లో మరింత పెరుగుదలకు అవకాశాలు పరిమితంగా కనిపిస్తున్నాయని అందువల్ల ఎఫ్‌ఐఐ లకు భారత్ ఖరీదైన మార్కెట్‌గా మారిందని అన్నారు.
టెక్నాలజీ వైపు ప్రపంచ పెట్టుబడులు
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే అంశాలు కూడా ఇటీవలి కాలంలో మారుతున్నాయని టెక్నాలజీలో ఆధిపత్యం వహిస్తున్న దేశాల్లో సాంకేతిక కంపెనీల్లోకి అంతర్జాతీయ పెట్టుబడులు తరలుతున్నాయని సుబ్బారావు తెలిపారు. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వచ్చిన భారీ వృద్ధి కారణంగా, అమెరికాలోని టెక్నాలజీ సంస్థలకు గణనీయమైన పెట్టుబడులు లభిస్తున్నాయని వివరించారు. సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అమెరికా, తైవాన్, చైనా వంటి దేశాలు ఈ రంగాల్లో పెట్టుబడలకు గమ్యస్థానాలుగా మారుతున్నాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల్లో వస్తున్న ఈ మార్పు ఎఫ్‌ఐఐలు కేవలం వృద్ధి అవకాశాలనే కాకుండా సాంకేతిక నాయకత్వాన్ని దాని ద్వారా వచ్చే రాబడులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సూచిస్తోందన్నారు. భారత ఈక్విటీలను పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఉత్పాదకతను పెంచడం ఎగుమతుల పోటీతత్వాన్ని బలోపేతం చేయడం , లావాదేవీ వ్యయాలను తగ్గించడం విధానపరమైన అనిశ్చితిని తొలగిండచం, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో సామర్థ్యాలను అభివృద్ధి చేయడం అవసరమన్నారు. చెల్లింపుల ఖాతా (కరెంట్‌అకౌంట్) ఖాతా (క్యాపిటల్ అకౌంట్) రెండింటిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
ఎఫ్‌సీఎన్‌ఆర్ పథకం ఒక బీమా లాంటిది
రూపాయి బలోపేతానికి రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్‌ఆర్) పథకంపై మాట్లాడుతూ రూపాయి పతనం కారణంగా మార్కెట్‌లో పెరిగిన అస్థిరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన అత్యవసర చర్యగా ఈ పథకాన్ని సమర్ధించవచ్చని సుబ్బారావు అన్నారు. ఈపథకం ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించడం గొప్పవిషయం కాదని అన్నారు. ఎఫ్‌సీఎన్‌ఆర్ పథకాన్ని తాను ఒక రకమైన బీమాగా పరిగణిస్తానని చెప్పారు. విదేశీ మారక నిల్వలను పెంచడం ద్వారా కల్లోల మార్కెట్‌ను స్థిరపరచి తక్షణ ప్రయోజనం పొందవచ్చిన అయితే ఆ నిధుల సమీకరణకు అయ్యే ఖర్చు ఎంతన్నది కూడా పరిగణించాలని అన్నారు.
ఆర్‌బీఐ వడ్డీరేటు పెంపు సరైనదే
ద్రవ్యోల్బణ కట్టడికి ఇటీవల ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేటు పెంచడం సమంజసమేనా అనే ప్రశ్నకు సుబ్బారావు స్పందిస్తూ కేంద్ర బ్యాంకు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. ధరల స్థిరత్వాన్ని కాపాడడం కేంద్ర బ్యాంకు ప్రధాన బాధ్యత అయినప్పటికీ ఆర్థిక వృద్ధి, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు ప్రధానంగా సరఫరా వైపు సమస్యలే కారణమని ముఖ్యంగా ముడిచమురు ధరల పెరుగుదల, ప్రతికూల రుతుపవన పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని వివరించారు.
ద్రవ్య విధానం ద్వారా చమురు ఉత్పత్తిని పెంచలేం, రుతుపవనాలను మెరుగుపరచలేం, అయితే సరఫరా సంబంధిత ఒత్తిళ్లు కొనసాగితే ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగి ధరల పెరుగుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకూ విస్తరించే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశమున్నట్లు ప్రారంభ సంకేతాలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ధరల పెరుగుదల దానతంట అదే చల్లారుతుందని ఆర్‌బీఐ భావించలేదని అందుకే వడ్డీరేట్లు పెంచిందని వివరించారు.
ఇదీ చదవండి: పదేళ్ల కనిష్టానికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్


