దేశీయ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముడిచమురు ధరల ఒత్తిళ్లు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ హెచ్చరించారు. ఈ పరిణామాల పట్ల పాలసీ రూపకర్తలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భారత ఆర్థిక స్థితిగతులు, ద్రవ్య విధానాల గురించి వ్యాఖ్యలు చేశారు.
గతంలో ద్రవ్యోల్బణం బలహీనంగా ఉన్నప్పుడు, వృద్ధి రేటు మందగించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం సరైన నిర్ణయమని శ్రీనివాసన్ ప్రశంసించారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆర్బీఐ తగిన సమయానికి స్పందిస్తోందని, రెండో విడత ప్రభావాలు (సెకండ్ రౌండ్ ఎఫెక్ట్స్) ఏ విధంగా ఉంటాయో అంచనా వేసేందుకు కేంద్ర బ్యాంకు వేచి చూసే ధోరణి అవలంబించడం వివేకవంతమైన చర్య అని కొనియాడారు.
క్రూడ్ ధరలను తేలికగా తీసుకోరాదు..
ప్రస్తుతం భారత్‌లో ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతంగా అంచనా వేశారని చెప్పారు. ఇది ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం (2 శాతానికి +/-) టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉన్నప్పటికీ ఇది క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల వల్ల కలిగే ఒత్తిళ్లను తేలికగా తీసుకోరాదన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే సంకేతాలు కనిపిస్తే సెంట్రల్ బ్యాంకులు వెంటనే స్పందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను ఆయన ప్రశంసించారు. కొవిడ్ మహమ్మారి, అంతర్జాతీయ యుద్ధాలు, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటి అనిశ్చితులు ఎదుర్కొన్నప్పటికీ కేంద్రం ద్రవ్య లోటును క్రమంగా తగ్గిస్తూ రావడం అభినందనీయమన్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా రుణ భారం పెరుగుతున్నందున భవిష్యత్ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు వృద్ధికి అనుకూలమైన ద్రవ్య సుస్థిరత విధానాలను అనుసరించాలని కోరారు. సవాళ్లు ఎదురవుతున్నా రాబోయే రోజుల్లో భారత్ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తుండటం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ పతనం!


