పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో E100 ఇంధన వినియోగానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) సవరించింది. అక్టోబర్ 23, 2026న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులను ప్రకటించింది. దీంతో వాహనాలకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో.. ఇప్పటికే ఉన్న E85తో పాటు E100కు కూడా చోటు కల్పించింది.
E85లో గరిష్ఠంగా 85 శాతం ఇథనాల్ ఉండగా, E100లో 100 శాతం ఇథనాల్ ఉంటుంది. ఇథనాల్‌ను ప్రధానంగా చెరకు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. అయితే.. ఈ ఇంధనాలను అన్ని పెట్రోల్ వాహనాల్లో ఉపయోగించడం సాధ్యం కాదు. అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన లేదా మార్పులు చేసిన వాహనాల్లో మాత్రమే వీటిని ఉపయోగించాలి. అంతే కాకుండా.. E10 పెట్రోల్ స్థానంలో E20 పెట్రోల్‌ను చేర్చారు. E10లో 10 శాతం ఇథనాల్ ఉంటే, E20లో 20 శాతం ఉంటుంది.
ప్రస్తుతం భారతదేశంలోని అన్ని కార్లు ఈ100 ఇథనాల్ ఇంధనానికి అనుకూలంగా లేవు. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు దీనికి తగిన విధంగా రూపాంతరం చెందింది. దీని ధర రూ.7.24 లక్షలు కాగా.. ఇందులోని 1.2 లీటర్ కే12ఎన్ ఇంజిన్‌ను అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుగుణంగా రూపొందించారు.
సుజుకి గిక్సర్ 250, యమహా FZకు చెందిన కొన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లు E85 వరకు ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగించగలవని సమాచారం. హీరోకు చెందిన కొన్ని మోటార్‌సైకిళ్లు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
ఇథనాల్ వినియోగం వల్ల ఉపయోగాలు
ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంది. దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభించవచ్చు. అయితే.. ఇథనాల్ వాడితే మైలేజీ లేదా ఇంధన ఖర్చు తప్పనిసరిగా తగ్గుతుందని చెప్పలేం. వాహనం పనితీరు, ఇంధన ధర, ఇంజిన్ రూపకల్పన ఆధారంగా ఫలితాలు మారుతాయి.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సాధారణ పెట్రోల్ వాహనాల్లో తయారీదారు అనుమతి లేకుండా E85 లేదా E100 ఉపయోగించకూడదు. తాజా నిబంధనలు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి మార్గం సుగమం చేసినప్పటికీ, వాటి లభ్యత, అనుకూల వాహనాల సంఖ్య పెరగడం కీలకంగా మారనుంది.
ఇదీ చదవండి: బిల్ గేట్స్ హెచ్చరిక.. ఉద్యోగాలకు ముప్పు!


