న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర రోడ్ల రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2030 అక్టోబరు నుంచి కొత్త కార్ల మోడళ్లలో అధునాతన అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థ (ఏఈబీఎస్)ను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న పాత కార్ల మోడళ్లకు 2032 అక్టోబరు నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అక్టోబరు 19, 2026న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్–185)కు అనుగుణంగా ఈ వ్యవస్థ ఉండాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజాభిప్రాయాలను స్వీకరించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్ స్పందించకపోతే ‘ఏఈబీఎస్’ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. తద్వారా ప్రమాదాన్ని నివారించడం లేదా ఢీకొన్నప్పుడు దాని ప్రమాద తీవ్రతను తగ్గించడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్చడం తప్పనిసరి కానుంది.
∙మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాల భద్రతను పెంచేందుకు బ్రేకింగ్ వ్యవస్థలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను ప్రతిపాదించింది. ట్రక్కుల్లో బ్రేకుల పనితీరును మెరుగుపరిచేందుకు సవరించిన బ్రేకింగ్ ప్రమాణాలను 2027 అక్టోబరు 1 నుంచి తప్పనిసరి చేయనుంది. అదే తేదీ నుంచి ట్రక్కులకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ) వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు. ఏఐఎస్–162 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఈ వ్యవస్థ, ముఖ్యంగా మలుపుల్లో బ్రేకులు వేసినప్పుడు వాహన స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


