దీపావళి వచ్చిందంటే సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు, లగ్జరీ కానుకలతో ఉద్యోగులను ఆనందింపజేస్తుంటాయి. అలా హర్యానాలోని పంచ్‌కులలోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఈ దీపావళి వేళ తన ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి వార్తల్లో నిలిచింది! కష్టపడి పనిచేసే ఉద్యోగుల ప్రతిభను, కంపెనీ పట్ల వారికున్న విశ్వాసాన్ని మెచ్చి, ఏకంగా 'కియా సోనెట్' (Kia Sonet) బ్రాండ్ న్యూ ఎస్‌యూవీ (SUV) కార్లను కానుకగా ఇచ్చింది. కంపెనీ నిర్ణయం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉద్యోగులు తమ కొత్త కార్లను అందుకుని సంబరాలు చేసుకుంటున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
'మిట్స్ హెల్త్‌కేర్' (MITS Healthcare) సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఎంకే భట్నా (MK Bhatia) తన సంస్థలో పనిచేసే నలుగురు ఉద్యోగులకు కొత్త కార్లను బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన వేడుకలు షోరూమ్‌లో ఘనంగా జరిగాయి. ఫౌండర్ భట్నా తన లగ్జరీ BMW కార్‌లో డీలర్‌షిప్ వద్దకు చేరుకోని నాలుగు కొత్త కియా సోనెట్ కార్లను తాళాలను తోటి ఉద్యోగుల కరతాళ ధ్వనుల మధ్య వారికి అందించారు. దీంతో డ్రమ్స్ మోతలు, కేక్ కటింగ్స్ మధ్య ఆ నలుగురు ఉద్యోగులు ఆనందంతో తమ కొత్త కార్లపై ఉన్న ముసుగులను తొలగించడంతో ఒక్కసారిగా ఆంనదం వెల్లివిరిసింది. ఈ వేడుకల వీడియోలు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదీచదవండి: 1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగ పందెంలో కవితకు ఓటమి

కంపెనీలో కష్టపడి పనిచేసి, మంచి ఫలితాలు సాధించిన ఉద్యోగులను ప్రోత్సహించడమే ఈ కానుకల ప్రధాన ఉద్దేశం. ఈ కార్లను అందుకున్న ఒక ఉద్యోగి మాట్లాడుతూ తాను మిట్స్ హెల్త్‌కేర్‌లో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నానని, తన కష్టానికి తగిన గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్లకు సంబంధించిన డౌన్ పేమెంట్‌ను కంపెనీయే చెల్లించింది. కార్లు నేరుగా ఉద్యోగుల పేరుపైనే రిజిస్టర్ అయ్యాయి. ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐ (EMI) నిమిత్తం ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తం సర్దుబాటు చేస్తారు.
ఇదీ చదవండి: 15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్న సీరియల్ కిల్లర్ అరెస్ట్
అందరికీ ఛాన్స్ – లక్కీ డ్రా
కేవలం కొందరికే కాకుండా... కంపెనీలో కనీసం 18 నెలలు పూర్తి చేసుకున్న అర్హులైన ఉద్యోగులందరి కోసం ఒక లక్కీ డ్రాను కూడా ప్రారంభించారు. ఇందులో సెక్యూరిటీ గార్డుల నుంచి సీనియర్ అధికారుల వరకు అందరికీ కారు గెలుచుకునే అవకాశం కల్పించడం విశేషం.
ఇదే తొలిసారి కాదు
ఎంకే భట్నా కంపెనీ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2024 పండుగ సీజన్‌లో కూడా సంస్థలోని 15 మంది ఉద్యోగులకు టాటా పంచ్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి కార్లను బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు!


