breaking news
flex fuel
-
ఈ–20... మనకేంటి?
ఇథనాల్!!. దీనిచుట్టూ ముఖ్యమైన ఆర్థికాంశాలున్నాయి. దాన్ని మించిన రాజకీయాలున్నాయి. వీటన్నిటినీ మించిన ప్రచార హోరు ఉంది. సరే! మరి వాస్తవాలేంటి? ఈ–20, ఈ–30 నుంచి మనమిప్పుడు ఈ–85కు వచ్చేశామని కేంద్రం ఘనంగా ప్రకటిస్తోంది. అంటే... 85 శాతం ఇథనాల్, మిగిలిన 15 శాతం పెట్రోల్ కలిపి వాహనాల్లో ఇంధనంగా వాడతారన్న మాట. మరి ఇలా వాడటం వల్ల ఎవరికెంత లాభం? ఎవరికెంత నష్టం? మన వాహనాలు వీటన్నిటికీ రెడీయేనా? ఇదంతా కేవలం ప్రభుత్వ దిగుమతి బిల్లు తగ్గించుకోవటానికేనా? పర్యావరణ హితమని చెబుతున్నదాంట్లో నిజమెంత? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం..రూపాయి పతనాన్ని అడ్డుకోవాలన్నా... డాలర్ కాస్త దిగిరావాలన్నా మొదట మనం చమురు, బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపేసి విక్రయించటం మొదలుపెట్టింది కూడా అందుకే. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లో మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై... రకరకాల దశలు దాటుతూ చివరకు 2014 నాటికి బ్లెండింగ్ 2 శాతానికి చేరింది. అప్పట్లో ఇథనాల్ ఉత్పత్తి భారీగా లేకపోవటమూ దీనిక్కారణమే. కానీ తరవాత కేంద్రం వేగంగా కదిలి.. ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవటంతో ఇపుడు పెట్రోల్‌లో ఇథనాల్ 20 శాతానికి చేరిపోయింది. ఇపుడు దేశంలో ఏకంగా రోజుకు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతోంది. దీనిలో 12 బిలియన్ లీటర్లను మాత్రమే ఈ–20 రూపంలో కలపగలుగుతున్నారు. మిగిలిన ఇథనాల్‌ను కూడా వాడకంలోకి తెచ్చేందుకే ఇపుడు ఏకంగా ఈ–85 అంటూ ఫ్లెక్స్ ఇంధనాన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం పలు కంపెనీలు ఫ్లెక్స్ వాహనాలను కూడా తయారు చేయటం మొదలెట్టాయి. జనం ఆందోళనేంటి? అందులో నిజమెంత? ఈ–85 ఫ్లెక్స్ ఇంధనాన్ని దానికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ వాహనాల్లో వాడతారు కనక ఇబ్బందులుండవు. కానీ ఈ–20 అనేది చాలా వేగంగా సాధించిన బ్లెండింగ్. ఈ బ్లెండింగ్ పెరిగినంత వేగంగా దాన్ని తట్టుకునే వాహనాలను కంపెనీలు తయారు చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచీ ఈ–20 మిశ్రమాన్ని తట్టుకునే వాహనాలనే తయారు చేయాలని కేంద్రం నిబంధనలు తెచ్చింది. 2025 నుంచి ఈ–20ని మరింత సమర్థంగా మార్చే వాహనాల్ని తయారు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇదంతా బాగానే ఉంది. కానీ 2023కు ముందు రోడ్లపైకి వచ్చిన వాహనాల సంగతేంటి? అవి ఈ–20ని తట్టుకోగలవా? వాహనాలు పాడైపోవా? జవాబుదారీ ఎవరిది? ఇదే జనం ఆందోళన. వాటిలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... ఈ–10 వరకూ ఫర్వాలేదు... ఈ–10 వరకూ ఏ వాహనమైనా ఓకే. ప్రపంచవ్యాప్తంగా వాహనాలన్నీ ఈ–10తో పెద్ద సమస్యలు లేకుండానే నడుస్తున్నాయి. వాహనాల జీవితకాలం పెద్దగా తగ్గటమంటూ ఉండదు. ఈ–20.. ఆధునిక వాహనాలైతే ఓకే... వీటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలైతే (2023 ఏప్రిల్ తర్వాత వచ్చినవి) ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎందుకంటే వాహనాల ఫ్యూయల్ పంప్‌లను, ఇంజెక్టర్లను, ఫ్యూయల్ లైన్స్‌ను, ఇంజిన్ కాలిబరేషన్ను కంపెనీలు మార్చాయి. కానీ ఇలా మార్చని వాహనాల్లో ఈ–20 వాడితే కొంత ఇబ్బందేనన్నది నిపుణుల మాట. ట్యాంకు, పంపు, పైపులు, ఇంజెక్టర్లు, రబ్బర్ సీల్స్‌తో కూడిన ఇంజిన్ సిస్టమ్ దీర్ఘకాలంలో అరిగి దెబ్బతినే అవకాశాలు ఎక్కువన్నది వారి వారి్నంగ్. ఈ–85, ఈ–100... ఫ్లెక్స్ వాహనాలకే ఈ ఇంధనాన్ని వాడాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు కావాలి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనం వాడలేం. దీనికి విభిన్నమైన ఫ్యూయల్ మ్యాపింగ్, సెన్సర్లు, భిన్నమైన భాగాలుంటాయి కనక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ రకం వాహనాలను ఇప్పటికే బ్రెజిల్లో లక్షల కొద్దీ వాడుతున్నారు. మన దేశంలోనూ పలు కంపెనీలు ప్రత్యేక ఫ్లెక్స్ వాహనాలను తయారు చేసి ఇప్పటికే విడుదల చేశాయి.పికప్, మైలేజీ సంగతేంటి?ఇథనాల్‌ను పెట్రోల్‌తో పోలిస్తే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. దీంతో ఇంజిన్ న్యాకింగ్ను బాగా తట్టుకుంటుంది. సామర్థ్యం ఎక్కువ. పికప్ బాగుంటుంది. కాకపోతే మైలేజీ మాత్రం పెట్రోల్‌తో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో 30– 35 శాతం ఎనర్జీ తక్కువ. దీనివల్ల ఈ–20 అయితే 3–8 శాతం... ఈ–85 అయితే 20–30 శాతం, ఈ–100 అయితే 25–35 శాతం మైలేజీ పడిపోయే అవకాశం ఎక్కువ. అంటే ఇథనాల్‌తో మైలేజీ తగ్గటమన్నది వాస్తవం. ఇక ఇంజిన్ విషయానికొస్తే కొత్త వాహనాలకైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 2023కు ముందు వాహనాలైతే కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. పైపెచ్చు ఇథనాల్ గాలి నుంచి ఎక్కువ తేమను లాక్కుంటుంది. దీనివల్ల దీర్ఘకాలం వాడకుండా ఉంచితే పనిచేయటం మానేయొచ్చు. బోట్లు, జనరేటర్లలోనూ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి.లాభమెవరికి... నష్టమెవరికి?దిగుమతుల కోసం భారీగా డాలర్లు వెచ్చిస్తున్న మన కేంద్ర ప్రభుత్వానికి ఇథనాల్ కాస్త ఊరటనే చెప్పాలి. దీనివల్ల కొంతయినా దిగుమతుల బిల్లు తగ్గుతోంది. చెరకు రైతులకూ కొంతవరకూ లాభమే. గ్రామాల్లో డిస్టిలరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. లాజిస్టిక్స్ అవసరాలు పెరుగుతాయి. కాకపోతే... భారీగా చెరకు, జొన్న, ఆహారధాన్యాలు అవసరమవుతాయి. పైపెచ్చు చెరకు పంటకు విపరీతమైన నీటి వనరులు కావాలి. భారీగా పండించాలంటే భారీగా జలవనరులూ కావాలి. ఇదే పలువురి ఆందోళనకు కారణమవుతోంది. పంటలను ఆహారానికి ఖర్చు చేయాలా? ఇంధనానికి ఖర్చు చేయాలా? అన్న చర్చ కూడా మొదలైంది. వీటన్నిటికీ కేంద్రం సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఇథనాల్ ఎకానమీ ప్రశాంతంగా ముందుకెళుతుంది.ఇదీ... ఫ్లెక్స్ ఎకానమీ ఈ–85 ఇంధనాన్ని ఈ–20 కన్నా లీటరుకు రూ.20 తగ్గించి విక్రయిస్తున్నారు. దీన్నో ఆకర్షణీయ డిస్కౌంట్‌గా ప్రభుత్వం చెబుతున్నా... తగ్గుతున్న మైలేజీతో పోలిస్తే ఈ డిస్కౌంట్ వల్ల ఏమాత్రం లాభం లేదన్నది సామాన్యుల మాట. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది చివరి నాటికి ఈ–85 ఇథనాల్ స్టేషన్లను 500 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 5వేలకు చేర్చాలనేది లక్ష్యం. ఇక వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు తెచ్చేశాయి. మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్, హీరో సంస్థ స్ప్లెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌లో ఫ్లెక్స్ మోడళ్లు తెచ్చాయి. మిగిలిన కంపెనీలూ పలు మోడళ్ల తయారీలో ఉన్నాయి.ఏంటీ ఇథనాల్? ఎలా వస్తుంది?ఇథనాల్ అంటే... చక్కెరలు, పిండిపదార్థాలు పులియబెట్టడం ద్వారా తయారయ్యే ఆల్కహాల్. సాధారణంగా చెరకురసం, చక్కెర పరిశ్రమలో వచ్చే మొలాసిస్, జొన్న, పాడైన ఆహారధాన్యాలు, వరి, గోధుమ, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తుంటారు.స్టాక్ మార్కెట్లో లబ్ధిదారులు ఎవరు?భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల (ఈ20, ఈ85, ఈ100) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఇథనాల్ సంబంధిత కంపెనీలు సమానంగా లాభపడవు. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.ఇథనాల్ ఉత్పత్తి కంపెనీలుబల్రామ్పూర్ చినీ మిల్స్ దేశంలోని అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. భారీ స్థాయిలో డిస్టిలరీల విస్తరణ. చక్కెర, ఇథనాల్ వ్యాపారాల సమీకరణ చేస్తుంది. ఇథనాల్ డిమాండ్ పెరిగితే అత్యధికంగా లాభపడే కంపెనీల్లో ఇది ముందుంటుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ ఇథనాల్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణంలో నైపుణ్యం. ఏ కంపెనీ కొత్త ప్లాంటు నిర్మించినా ఆర్డర్లు పొందే అవకాశం.రెండో తరం (2జీ) ఇథనాల్ టెక్నాలజీలో కూడా కీలక పాత్ర. దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 20 బిలియన్ లీటర్ల నుంచి 30 బిలియన్ లీటర్లకు పెరిగితే ప్రజ్కు భారీ అవకాశాలు ఉండొచ్చు. త్రివేణి ఇంజినీరింగ్చక్కెర. డిస్టిలరీలు, ఇథనాల్ ఈ మూడు రంగాల్లోనూ ఉనికి ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. దాల్మియా భారత్ షుగర్ లిస్టెడ్ షుగర్ కంపెనీల్లో ఇథనాల్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన సంస్థల్లో ఒకటి. శ్రీ రేణుక షుగర్స్ చక్కెర, ఇథనాల్ రంగాల్లో బలమైన స్థానం కలిగిన కంపెనీ.మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కంపెనీలు నీటి కొరత కారణంగా భవిష్యత్తులో చెరకు కంటే మొక్కజొన్న (మైజ్) ఆధారిత ఇథనాల్‌కు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. → గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ – మొక్కజొన్న ప్రాసెసింగ్‌లో బలమైన ఉనికి. → సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్చమురు మార్కెటింగ్ కంపెనీలు: → ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ → భారత్ పెట్రోలియం కార్పొరేషన్→ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ఇవి ఈ 85, ఈ100 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి. ఇథనాల్ నిల్వలు, రవాణా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాయి. అయితే వీటి మొత్తం ఆదయాంలో ఇథనాల్ వాటా తక్కువే కావడం వల్ల ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశముంది.ఆటో మొబైల్ కంపెనీలు → మారుతీ సుజుకీ దేశంలో తొలి ఫ్లెక్స్–ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుగానే సన్నద్ధమవుతోంది. → హీరో మోటోకార్ప్ భారత్ ప్రధానంగా ద్విచక్ర వాహనాల మార్కెట్ కావడంతో మంచి అవకాశాలు ఉన్నాయి. → బజాజ్ ఆటో భవిష్యత్తులో ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన ఎంపికలే..ఇంకా ఇథనాల్ తయారీదారులతో పాటు డిస్టిలేషన్ పరికరాల తయారీ, నిల్వ ట్యాంకులు, ఇన్ఫ్రా, బయోఫ్యూయెల్, ధాన్యం ప్రాసెసింగ్ కంపెనీలకూ లాభమే. → భారత్‌లో ఈ–20 అమల్లో ఉంది. అంటే మనకు వస్తున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. → బెజిల్ ఎప్పటి నుంచో ఈ–85. ఈ–100ని విక్రయిస్తోంది. (రమణమూర్తి మంథా) -
ఇథనాల్‌తో నడిచే కొత్త బైక్‌లు.. రూ.4,000 తక్కువ ధరకే!
భారతదేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే దిశగా.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇటీవల రెండు కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేసింది. అవి ఒకటి స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, రెండు హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్. కంపెనీ ఈ రెండు బైకులపై రూ.4,000 ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉంటుంది.ధరల తగ్గింపు కారణంగా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ధర రూ.82,710 నుంచి రూ.78,710కు తగ్గింది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.72,792 నుంచి రూ.68,792కు చేరింది. దీంతో ఈ రెండు బైకులు సాధారణ వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చాయి.ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ల ప్రత్యేకతహీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు E85 ఇంధనంతో పనిచేస్తాయి. E85 అంటే.. 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలయిక. సాధారణ పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే ఈ విధమైన ఇంధనం పర్యావరణానికి కొంత తక్కువ హానికరం. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.E85 ఇంధనాన్ని ఉపయోగించేందుకు హీరో మోటోకార్ప్ ఈ బైక్‌లలో కొన్ని సాంకేతిక మార్పులు చేసింది. వాటిలో ప్రత్యేక ఫ్యూయల్ పంప్, అదనపు ఫ్యూయల్ ఫిల్టర్, ఇంధన మిశ్రమాన్ని గుర్తించి తగిన విధంగా ఇంధన సరఫరాను నియంత్రించే రీక్యాలిబ్రేటెడ్ ECU (ఇంజిన్ కంట్రోల్ యూనిట్) వంటివి ఉన్నాయి.ఇంజిన్ పనితీరుఈ రెండు బైక్‌లలో 97.2 సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. E85 మోడ్‌లో ఈ ఇంజిన్ 8.4 బిహెచ్పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం.. E85 ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే పవర్ 7 శాతం, టార్క్ 3 శాతం పెరుగుతాయి. అంటే.. ఈ బైక్‌లు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, కొంత మెరుగైన పనితీరును కూడా అందిస్తాయి.హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు జూలై 2026 నుంచి ముందుగా ఢిల్లీ, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలు, రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నారు. -
లీటర్‌పై రూ.20 డిస్కౌంట్!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త ప్రత్యామ్నాయాన్ని మార్కెట్లోకి తెచ్చింది. లీటరుపై ఏకంగా రూ.20 రూపాయల వరకు తగ్గింపు ఇస్తూ ఢిల్లీలో సరికొత్త ‘ఈ-85 ఫ్యూయల్ స్టేషన్’ను ఇటీవల ప్రారంభించింది. అయితే, ఊహించని విధంగా ఈ చౌక ఇంధనాన్ని కొనడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. బంకులు తెరిచినా కొనుగోలుదారులు రాకపోవడానికి గల అసలు కారణాలను పరిశీలిద్దాం.అసలు ఏమిటీ ఈ-85 ఇంధనం?ఈ-85 అనేది సాధారణ పెట్రోల్ కాదు. ఇది 85 శాతం ఇథనాల్, 15 శాతం సంప్రదాయ పెట్రోల్ కలయికతో తయారైన ఒక మిశ్రమ బయో-ఇంధనం. ముడి చమురు దిగుమతులపై విదేశీ భారాన్ని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. పెట్రోలియం కంపెనీల తయారీ వ్యయం తగ్గడం వల్ల సాధారణ పెట్రోల్ కంటే ఇది లీటరుకు దాదాపు రూ.20 రూపాయల తక్కువ ధరకు లభిస్తుంది.ఇంత చౌకగా ఉన్నా ఎందుకు కొనడం లేదు?ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో కొన్ని సాంకేతిక, అవగాహనా లోపాలు అమ్మకాలను దెబ్బతీస్తున్నాయి.ఇంజిన్ల అననుకూలత: సాధారణ పెట్రోల్‌తో నడిచే బైక్‌లు లేదా కార్లలో నేరుగా ఈ-85 ఇంధనాన్ని వాడటం అసలు సాధ్యం కాదు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లు కలిగిన వాహనాలు మాత్రమే అవసరం. ప్రస్తుతానికి భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇలాంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనాన్ని పోస్తే ఇంజిన్లు పాడైపోయే ప్రమాదం ఉంది.అవగాహన రాహిత్యంకొత్తగా వచ్చిన ఈ-85 ఇంధనం గురించి సాధారణ వాహనదారులకు కనీస అవగాహన లేదు.ఈ ఇంధనం ఏ వాహనాలకు సరిపోతుంది?దీనివల్ల మైలేజీ ఎంత వస్తుంది?పాత వాహనాలను ఫ్లెక్స్ ఇంజిన్లుగా మార్చవచ్చా లేదా?అనే విషయాలపై ప్రభుత్వం, చమురు సంస్థల నుంచి విస్తృత ప్రచారం కరువైంది. దీంతో వినియోగదారులు దీని జోలికి వెళ్లడం లేదు.భవిష్యత్తు మార్కెట్ ఎలా ఉండబోతోంది?ప్రస్తుతానికి ఈ-85 స్టేషన్లు కేవలం ప్రారంభ దశలోనే ఉన్నాయి. మార్కెట్లోకి పూర్తిస్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు, బైకులు అందుబాటులోకి వస్తేగానీ ఈ చౌక ఇంధనానికి డిమాండ్ పెరగదనే అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వం కేవలం బంకులను ఏర్పాటు చేయడమే కాకుండా, వాహన తయారీ సంస్థలను ప్రోత్సహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
పెట్రోల్ కన్నా రూ.20 తక్కువ.. ఈ85 ఇంధనం
న్యూఢిల్లీ: ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల కోసం దేశీయంగా ఈ85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియన్ఆయిల్ రిటైల్ ఔట్లెట్లో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దీన్ని ఆవిష్కరించారు.సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దీని ధర లీటరుకు రూ. 20 మేర తక్కువకే లభిస్తుంది. ప్రాథమికంగా ఇది ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే లభిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యుయల్ ఇంజిన్లున్న వాహనాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించడానికి వీలవుతుంది. తొలుత 48 ప్రభుత్వ రంగ బంకులతో ప్రారంభించి 2026 డిసెంబర్ నాటికి 500 ఔట్‌లెట్స్‌లో, 2027 డిసెంబర్ నాటికి 5,000 ఔట్లెట్స్లోను అందుబాటులోకి తెస్తారు.80–85 శాతం ఇథనాల్, 14–19 శాతం పెట్రోల్ ఉండే మిశ్రమ ఇంధనాన్ని ఈ85గా వ్యవహరిస్తారు. ఈ20 నుంచి ఈ100 వరకు ఇథనాల్ మిశ్రమాలపై పని చేసే ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలకు ఇది అనువుగా ఉంటుంది.


